పాతకక్షలు, అసూయతోనే దోస్తును చంపిడు

పాతకక్షలు, అసూయతోనే దోస్తును చంపిడు
  •     రియల్టర్ మర్డర్ కేసును ఛేదించిన జూబ్లీహిల్స్ పోలీసులు
  •     8 మంది నిందితుల అరెస్ట్

జూబ్లీహిల్స్​, వెలుగు :  యూసుఫ్ గూడలో జరిగిన రియల్టర్ హత్య కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు.  స్నేహితులే అతడిని హత్య చేసినట్లు గుర్తించారు. ఇద్దరు స్నేహితులతోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కె. హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..  జీడిమెట్లలోని రాంరెడ్డినగర్​లో ఉంటున్న ఇండిగుల మణికంఠ(30), కుత్బుల్లాపూర్​లోని చింతల్ ప్రాంతానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్(29), నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం ప్రాంతా
నికి చెందిన రాము అలియాస్ రామన్న  ముగ్గురు ఫ్రెండ్స్. 

నిజాంపేటలో ఉండే రాము  20 ఏండ్లుగా జువా గేమ్ ఆడిస్తున్నాడు. మణికంఠ, వినోద్ అతడి దగ్గర సహాయకులుగా పనిచేసేవారు.  జువా గేమ్ విషయంలో మణికంఠ, రాము మధ్య గొడవ జరిగింది. దీంతో రాముపై మణికంఠ కక్ష పెంచుకున్నాడు. ఎల్ఎన్​నగర్​లో ఉంటున్న హిమాం బీ(35) కుమార్తె నసీమా(19), వినోద్ కుమార్ ప్రేమించుకుంటున్నారు. అయితే, రాము సైతం నసీమాతో  వెంటపడ్డాడు. ఈ విషయాన్ని ఆమె వినోద్ కుమార్​కు చెప్పడంతో అతడు రాముపై పగ పెంచుకున్నాడు. వినోద్​కుమార్​కు మణికంఠ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి రామును చంపేందుకు స్కెచ్ వేశారు. 

నసీమాకు, ఆమె తల్లికి డబ్బు ఆశ చూపించారు. కొల్లాపూర్​లో ఉంటున్న రాముకు నసీమాతో ఫోన్ చేయించారు. దీంతో ఆమె రామును సిటీకి రప్పించింది. బుధవారం రాత్రి 8.30 గంటలకు రాము యూసుఫ్​గూడలోని ఎల్ఎన్​నగర్​లో ఉన్న నసీమా ఇంటికి వెళ్లాడు.  మణికంఠ, వినోద్ కుమార్​ సహా మరో 11 మంది   నసీమా ఇంటికి వెళ్లి అక్కడ రామును దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మణికంఠ, వినోద్ కుమార్​తో పాటు కైసర్(24), శివకుమార్(30), నిఖిల్(19), కుమార్(23), నసీమా(19), హిమాంబీ(35)ను సైతం అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.