మా దగ్గర మంత్రదండం లేదు.. ఢిల్లీ వాయు కాలుష్యనియంత్రణపై సుప్రీం కోర్టు

మా దగ్గర మంత్రదండం లేదు.. ఢిల్లీ వాయు కాలుష్యనియంత్రణపై సుప్రీం కోర్టు
  • ఢిల్లీ వాయు కాలుష్యనియంత్రణపై సుప్రీం కోర్టు 
  • ఆ బాధ్యత నిపుణులదేనని కామెంట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు వద్ద ఎలాంటి మంత్రదండంలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని పరిష్కరించడంలో న్యాయ వ్యవస్థలకు పరిమితులు ఉంటాయని స్పష్టం చేశారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను అత్యవసరంగా విచారించాలని అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న  సీనియర్​ లాయర్​ అపరాజితా సింగ్​ కోరారు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదించారు. 

‘ఇది హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్  స్పందిస్తూ.. ‘‘ఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, జనం తీవ్ర అవస్థలకు గురవుతున్నారని మాకు తెలుసు. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు మా దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా? మేం ఆదేశాలు జారీ చేస్తే కాలుష్యం తొలగి ఏక్యూఐ మెరుగుపడుతుందా?” అని  న్యాయవాది అపరాజితా సింగ్ ను ప్రశ్నించారు. వ్యవస్థాగతమైన దీర్ఘ కాలిక చర్యల ద్వారానే ఢిల్లీ వాయు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది. ఇందుకోసం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయగలం. వెంటనే స్వచ్ఛమైన గాలిని అందించాలని ఆదేశాలు ఇవ్వలేం. సమస్య ఏంటో అందరికీ తెలుసు. మనం అన్ని కారణాలను గుర్తించాలి. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి పరిష్కారం కనుగొనడం నిపుణులు, శాస్త్రవేత్తల బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అత్యవసర విచారణకు నిరాకరించారు. దీనిపై డిసెంబర్ 1న విచారణ చేపట్టేందుకు జస్టిస్ జోయ్ మల్య బాగ్చి అంగీకరించారు.