జులై 3న కేంద్ర కేబినెట్ భేటీ

జులై 3న కేంద్ర కేబినెట్ భేటీ
  • మంత్రివర్గంలోకి ఫడ్నవీస్, ప్రఫుల్?
  • కేబినెట్​లో మార్పులపై కొన్ని రోజులుగా ప్రచారం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం (ఈ నెల 3న) కేంద్ర కేబినెట్ భేటీ అవుతోంది. ప్రగతి మైదాన్‌‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌‌లో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండడం, తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అజిత్ పవార్ తో చేతులు కలిపిన కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కు కేబినెట్ లో చోటు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌‌ కూడా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

భాగస్వామ్య పార్టీలకు కూడా క్యాబినెట్ మార్పులు, చేర్పుల్లో చోటు దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, పార్లమెంటు వర్షాకాల సమవేశాల తేదీలు కూడా ఖరారైన నేపథ్యంలో జరుగుతున్న ఈ మంత్రిమండలి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.