- తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ రైట్స్ అసోసియేషన్ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్–4 జూనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లలో ప్రయారిటీ ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ రైట్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో అధ్యక్షుడిగా పరమాత్మ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా విజయ రామరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నంబర్ 81, 85 ద్వారా వీఆర్ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో గత ప్రభుత్వం నియమించిందని, వారిని ప్రస్తుత ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సూపర్ న్యూమరీ పోస్టుల్లో విలీనమైన వారికి సాధారణ కేడర్ ఉద్యోగులతో సమానంగా సీనియార్టీ, ప్రొబేషన్, ప్రమోషన్ అవకాశాలు కల్పించడం నియామకాలకు విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో జూనియర్, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, సిబ్బంది ప్రమోషన్లలో తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
రెవెన్యూ శాఖలో ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దుర్గ భవాని, సుమన్ నాయక్, చంద్రమోహన్, గౌతమ్, సాయి పవన్, రమేశ్ నాయక్, మణిక్రాంత్ పాల్గొన్నారు.
