ఎల్కతుర్తి, కాటారంలో కోర్టుల మంజూరు

ఎల్కతుర్తి, కాటారంలో కోర్టుల మంజూరు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భూపాలపల్లి జిల్లా కాటారంలో జూనియర్ సివిల్ జడ్జి కం -జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఎల్కతుర్తి, కాటారం పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయసేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ రెండు ప్రాంతాల ప్రజలు చిన్నపాటి కేసుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. 

కోర్టు ప్రారంభానికి అవసరమైన సిబ్బంది నియామకం, మౌలిక వసతులు, బడ్జెట్ కేటాయింపు తదితర అంశాలపై సంబంధిత అధికారులు చర్చిస్తున్నారు. ఈ నిర్ణయం పై ఎల్కతుర్తి మండల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ‌‌‌‌‌‌‌‌మండల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవ్వడానికి కీలకంగా వ్యవహరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.