రేపటి నుంచి వరంగల్ లోని జూనియర్ డాక్టర్ల సమ్మె

రేపటి నుంచి వరంగల్ లోని జూనియర్ డాక్టర్ల సమ్మె
  • 22 నుంచి  సమ్మె చేస్తామంటూ జూనియర్ డాక్టర్ల నోటీసు

రేపటి(శుక్రవారం) నుంచి వరంగల్ లోని జూనియర్ డాక్టర్లు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. 5 నెలలు స్టైఫండ్ రాకపోవడంతో 22 నుంచి  సమ్మె చేస్తామంటూ నోటీసు ఇచ్చారు.

వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో టీచింగ్ హాస్పటల్స్ గా ఎంజిఎం సూపర్ స్పెషాలిటీ, హనుమకొండ, సీకేఎం ప్రసూతి హాస్పిటల్, టీబీ హాస్పిటల్, ఐ హాస్పిటల్ ఉన్నాయి. ఎంబీబీఎస్  పూర్తయ్యాక ఏడాది పాటు హౌజ్  సర్జన్లుగా విధులు నిర్వర్తించాకే ప్రాక్టీసుతో పాటు పీజీ చేయడానికి అర్హులు.  దీంతో  ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో హౌజ్ సర్జన్లుగా  డాక్టర్లకు సహాయంగా ఉంటూ శిక్షణ పొందుతారు.  2019-20 విద్యా సంవత్సరం కేఎంసీలో ఎంబీబీఎస్  చివరి సంవత్సరం పూర్తి చేసుకున్న 200 మంది వైద్య విద్యార్థులు హౌజ్  సర్జన్లుగా వరంగల్  ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.  ఒక్కో విద్యార్థికి నెలకు 22 వేలు భత్యంగా ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. వీరు చేరినప్పటి నుంచి స్టైఫండ్ అందడంలేదు. కరోనా సమయంలో  ఎంజీఎంకు  కోవిడ్ భారిన పడి వైద్యం కోసం  ఎక్కువగా రావడంతో పీజీ విద్యార్థులతోపాటు హౌజ్  సర్జన్లకు కొవిడ్  వార్డుల్లో డ్యూటీలు వేశారు. ఈ సమయంలో అనేక మంది వైద్య విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకినవారు పరీక్షలు, పౌష్టికాహారం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
  
ఎంబీబీఎస్  పూర్తి చేసుకొని హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్న వారికి ఐదు నెలలుగా స్టైఫండ్  అందడం లేదు. దీంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   ప్రతి నెలా హాజరు వివరాలను విద్యార్థులు అధికారులకు అందజేస్తున్నారు. గతంలో పీజీ విద్యార్థులు, ఎస్ ఆర్ లకు కేఎంసీ కళాశాల నుంచి, హౌజ్  సర్జన్లకు ఎంజీఎం ఆసుపత్రి నుంచి నేరుగా స్టైఫండ్ అందజేసేవారు. ఇది నెలనెలా అందకపోవడంతో ఖజానా నుంచి నేరుగా విద్యార్థులకు డబ్బులు వచ్చేలా అనుసంధానం చేశారు. హాజరును పరిశీలించి వైద్యాధికారులు ఖజానా కార్యాలయానికి బిల్లులు పంపుతున్నారు. అక్కడి నుంచి కూడా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు సక్రమంగా జమకావడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాము సమ్మె చేయకతప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
హౌజ్ సర్జన్లతో పాటు ఎంజీఎంలో పనిచేసే పీజీలకూ స్టైఫండ్ సక్రమంగా అందడం లేదు. మూడేళ్లకు కలిపి సుమారు 450 వరకు పీజీ విద్యార్థులు, మరో 200 మంది సీనియర్  రెసిడెంట్లు ఉన్నారు. పీజీ, ఎస్ ఆర్ లకు మూడు నెలలుగా డబ్బులు అందలేదు. పీజీ మొదటి సంవత్సరం వారికి .46 వేలు, రెండో ఏడాది వారికి.48 వేలు, మూడో సంవత్సరం వారికి రూ.50 వేల వరకు ప్రతి నెల స్టైఫండ్  ఇవ్వాల్సి ఉంది. ఇక సీనియర్  రెసిడెంట్ లకు70 వేల పైనే అందాల్సి ఉంది. వీరికి సక్రమంగా అందడం లేదు. ఏపీలో  రెగ్యూలర్ గా  స్టైఫండ్ అందుతోందని, తాము ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని హౌజ్ సర్టన్లు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో పనిచేసినప్పుడు 10 శాతం ఇన్సెటీవ్ లు ఇస్తామని సర్కార్ చెప్పిందని, అవి లేకున్నా స్టైఫండ్ ను రెగ్యూలర్ గా ఇవ్వాలంటున్నారు.  తాము సమ్మె చేయాలని, నిరసనలు తెలపాలని కోరుకోవడం లేదని హౌజ్ సర్జన్లు చెబుతున్నారు. సమ్మె చేస్తే  పేద ప్రజలకే ఇబ్బంది కలుగుతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తమ స్టైఫండ్ వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.