ఢిల్లీ: మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చే నెల 2న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఆ సభకు రావాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీలో పొంగులేటి, జూపల్లితోపాటు దాదాపు 150 మంది నాయకులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.
ఇందులో ఎక్కువ మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉండటం గమనార్హం. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, చిన్నా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, మల్లు రవి, సంపత్, వంశీ చంద్ రెడ్డి, బలరాం నాయక్, రేణుకా చౌదరి, సీతక్క తదితరులు కూడా హాజరయ్యారు.
పొంగులేటి, జూపల్లి తమ వెంట వస్తున్న నాయకులను రాహుల్, ఖర్గేలకు పరిచయం చేశారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ వీడిన కాంగ్రెస్ నేతలంతా తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని రాహుల్ పిలుపునిచ్చారు.
