కృష్ణా జలాల్లో మన వాటా మనకు రావట్లే : డీకే సమరసింహా రెడ్డి

కృష్ణా జలాల్లో మన వాటా మనకు రావట్లే : డీకే సమరసింహా రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత డీకే సమరసింహా రెడ్డి అన్నారు. మొత్తం 800 టీఎంసీలలో రాష్ట్రానికి 64 శాతం వాటా రావాల్సి ఉండగా రాట్లేదని, ఈ సమస్యపై ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరారు. తెలంగాణ వాళ్లు కృష్ణా నదీలో ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నారని కేంద్ర జల వనరుల శాఖ చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు. సోమవారం గాంధీ భవన్‌‌లో కాంగ్రెస్ కిసాన్ సెల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 

కృష్ణా పరివాహాక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ పెండింగ్‌‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌ సర్కార్‌‌‌‌ 100 రోజుల పాలన చాలా బాగుందని, అమలు చేయాల్సిన హామీల కంటే ఆయన ఎక్కువే చేశారన్నారు. కోదండ రెడ్డి మాట్లాడుతూ.. మొట్టమొదటి బచావత్ ట్రిబ్యునల్ తెలుగు రాష్ట్రాలకు న్యాయంగా నీళ్లను పంచిందని, కానీ బ్రిజేశ్‌‌ ట్రిబ్యునల్ వచ్చాకా అన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా కేటాయింపులు జరిగాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నీటి కేటాయింపులు మరింత దారుణంగా మారాయన్నారు.