బంజారా అర్చకులకు న్యాయం చేస్తాం : డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్

బంజారా అర్చకులకు న్యాయం చేస్తాం : డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్

రవీంద్రభారతి, వెలుగు: తెలంగాణలో బంజారా ధూప దీప నైవేద్య అర్చకులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌‌ రామచంద్రనాయక్‌‌ అన్నారు. అర్చకుల గౌరవభృతిని రూ.25 వేలకు పెంచే అంశాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర బంజారా అర్చకుల సంఘం ఆధ్వర్యంలో బంజారా అర్చకులు, సాధు సంత్‌‌ మహారాజ్‌‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రామచంద్రనాయక్‌‌ మాట్లాడుతూ గిరిజన పూజారులు సంత్‌‌ సేవాలాల్‌‌ స్ఫూర్తితో ఆధ్యాత్మిక సేవలు కొనసాగించాలని సూచించారు. బంజారా సమాజంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను కాపాడటంలో అర్చకుల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు శంకర్‌‌నాయక్‌‌, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌‌.వేణుగోపాలాచారి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌‌, రవీందర్‌‌నాయక్‌‌, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌‌, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌‌ వైస్‌‌ చైర్మన్‌‌ సుబ్రహ్మణ్య ప్రసాద్‌‌, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్‌‌ గంగు ఉపేందర్‌‌శర్మ, తెలంగాణ రాష్ట్ర బంజారా అర్చకుల సంఘం అధ్యక్షుడు జయరాం గురుస్వామి పాల్గొన్నారు.