అణగారిన వర్గాలకు న్యాయం చేస్తం : రాహుల్ గాంధీ

అణగారిన వర్గాలకు న్యాయం చేస్తం : రాహుల్ గాంధీ
  •  కేంద్రంలో అధికారంలోకి రాగానే బీసీ కులగణన 
  •  బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తం : రాహుల్ గాంధీ
  •  రాష్ట్రాల బీసీ సంఘాల నేతలతో భేటీ
  •  తెలుగు రాష్ట్రాల నుంచి జస్టిస్ ఈశ్వరయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: తాము అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపడుతామని, అణగారిన వర్గాలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. బీసీ జనాభాకు అనుగుణంగా వాటా దక్కేలా కాంగ్రెస్ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రాల బీసీ సంఘాల నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఆలిండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ (ఏఐబీసీఎఫ్) నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌‌కు తెలంగాణ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏఐబీసీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు విజయ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.

 దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో దేశంలోని బీసీలు, అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ఆయా సంఘాలు, రాష్ట్రాల వారీగా ఓబీసీల ఇబ్బందులపై ఆరా తీశారు. ‘మేమెంతో, మాకంత’ అనే డిమాండ్ నెరవేరాలంటే జనగణనలో కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్‌‌కు బీసీ నేతలు వివరించారు. 

ఈ విజ్ఞప్తులపై స్పందించిన రాహుల్.. కులగణన డిమాండ్‌‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలుతో పాటు, బీసీలు సామాజిక అభివృద్ధి చెందేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కులగణన అజెండాతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని, ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమికి మద్దతు తెలపాలని బీసీ సంఘాలను కోరారు. 

కాగా, కులగణనకు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాహుల్ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ్ యాత్రలో బీసీ సంఘాలు పాల్గొంటాయని తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణలో కులగణన చేపట్టాలని తెలుగు రాష్ట్రాల బీసీ నేతలు కోరారు.

కులగణన ఎందుకు చేపడ్తలే: బీజేపీపై జస్టిస్ ఈశ్వరయ్య ఫైర్

దేశంలో కులగణన చేయాలన్న డిమాండ్ పెరుగుతుండడంతో.. హిందుత్వం, ఆయోధ్యలో రామమందిరం అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తున్నదని జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. రామాలయం పేరుతో ఇంటింటికీ అక్షింతలు పంచుతున్న బీజేపీ.. కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయకుండా ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాల వారికి బీజేపీ మేలు చేసిందని విమర్శించారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కార్ ప్రైవేటీకరిస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఉద్యోగాలకు దూరం చేస్తున్నదని ఆరోపించారు. పదేండ్లుగా ఓబీసీ కులగణన నిర్వహించకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీలను నిర్లక్ష్యం చేసిందని జాజుల శ్రీనివాస్ విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జూడో న్యాయ్ యాత్రకు బీసీలందరూ మద్దతుగా నిలబడతామని తెలిపారు. ‘ఇండియా’ కూటమికి అండగా నిలిచి గెలిపించుకుంటామని చెప్పారు.