కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయలేరా? : జస్టిస్ సుదర్శన్​రెడ్డి

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయలేరా? : జస్టిస్ సుదర్శన్​రెడ్డి

ఓయూ, వెలుగు: ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల​ను రెగ్యులరైజ్ చేయలేరా అని సీఎం కేసీఆర్​ను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్​రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో 12 వర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిర్వహించిన రాష్ట్ర మహా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం ఆదేశాలిచ్చినా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల క్రమబద్ధీకరణకు ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఉన్నత విద్యాసంస్థల్లో పాఠాలు చెబుతున్న వారికి అనేక రకాల పేర్లు పెట్టి అంతరాలు సృష్టించడం తగదన్నారు. యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అధ్యాపకులను చిన్న చూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్​ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజ్ అంశం వేలాది కుటుంబాల సమస్య అని, అంతే కాకుండా భద్రత, ప్రతిష్టకు సంబంధించిన విషయమని వివరించారు. ప్రభుత్వం తలుచుకుంటే రెగ్యులరైజ్ చేయడం కష్టమేమీ కాదని పేర్కొన్నారు.

దశాబ్ది ఉత్సవాలకు అర్థం లేదు

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయకుండా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తే అర్థం లేదని సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. యూనివర్సిటీల భవిష్యత్తు కోసం వారిని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల యజమాన్యాలు ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశాలను సీఎం పట్టించుకోకపోవడం పట్ల తనకు చాలా బాధగా ఉందని వెల్లడించారు. మానవత్వం లేని సంపద, అభివృద్ధి ఎవరి కోసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ ఉద్యోగం లేని దానికంటే అభద్రతతో కూడిన ఉద్యోగం చాలా ప్రమాదమన్నారు. ఎన్నో ఏళ్లుగా అన్ని అర్హతలతో కాంట్రాక్ట్​ అసిస్టెంట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న వాళ్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర పాలకులు చరిత్రహీనులవుతారని హరగోపాల్ పేర్కొన్నారు.

ఇది బతుకు దెరువు సమస్య కాదు

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజ్ అనేది బతుకు దెరువు సమస్య కాదని ఇదొక తెలంగాణ సమస్య అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో 3వేల పైచిలుకు పోస్టులుంటే కేవలం 800 మంది మాత్రమే పర్మినెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారని తెలిపారు. రెండువేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతమున్న 1300 మంది కాంట్రాక్ట్​ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు.

ఉన్నత విద్యను విధ్వంసం చేసే కుట్ర

రాష్ట్రంలో ఉన్నత విద్యను విధ్వంసం చేసే కట్ర జరుగుతున్నదని ఆంధ్రజ్యోతి ఎడిటర్​శ్రీనివాస్ అన్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజ్ సమస్య తెలంగాణ సమస్య అని తెలిపారు. రెగ్యులరైజ్​పై ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర భాగస్వాములను కలుపుకొని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో యూసీటీ టీఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పరశురాములు, ధర్మతేజ, వేల్పుల కుమార్, కరుణాకర్ రావు, ఫిరోజ్,12 వర్సిటీల కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.