డెమోక్రసీపై నమ్మకం పోతున్నది: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

డెమోక్రసీపై నమ్మకం పోతున్నది: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత పరిస్థితులు ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయని, రాజకీయ పార్టీలు చట్టాల పరిధిలో లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. గత మేనిఫెస్టోలో ఆయా పార్టీలు అమలు చేసిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో శనివారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో 35 అంశాలతో కూడిన ప్రజా మేనిఫెస్టోను జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి రామలింగేశ్వర రావు రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. పొలిటికల్ లీడర్లు హద్దులు దాటి దూషించుకుంటున్నారని, మానవతా విలువలకు స్థానం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల పేరుతో సాధ్యంకాని హామీలు ఇస్తున్నాయని, అందుకే సమాజంలో వివిధ వర్గాల ప్రజలతో చర్చించి ప్రజా మేనిఫెస్టోను రూపొందించామని పద్మనాభ రెడ్డి అన్నారు. ఈ ప్రజా మేనిఫెస్టోలో విద్య, వైద్యం, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామని తెలిపారు. 

చిత్తుకాగితాలతో సమానం

రాజకీయ పార్టీలు విడుదల చేస్తున్న మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదని, అవి చిత్తుకాగితాలతో సమానమని రామలింగేశ్వర రావు అన్నారు. మేనిఫెస్టోలను కాకుండా.. వ్యక్తులను చూసి ఓటేయాలన్నారు. దళితవాడలను ప్రత్యేక జీపీలుగా ప్రకటించాలని దళిత బహుజన ఫ్రంట్ లీడర్ కల్పన డిమాండ్ చేశారు. పారదర్శకమైన పాలన కోసం ప్రతి జీవోను సర్కార్ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ప్రోగ్రామ్​లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమా శ్రీనివాస రెడ్డి, జాయింట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.