- రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రదానం
హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, దేశంలో ఎన్నో చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు’ దక్కింది. 2025 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లోని మగ్ధూం భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అవార్డు వివరాలను ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, సెక్రటరీ కందిమళ్ల ప్రతాపరెడ్డి వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు లోటస్ పాండ్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై.. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి అవార్డును అందజేయనున్నారని చెప్పారు. అనంతరం ‘భారత రాజ్యాంగం– భావప్రకటన స్వేచ్ఛ’ అనే అంశంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్మారకోపన్యాసం చేస్తారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసమే కాకుండా 200 ఏండ్లకు పైగా నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు సాగిన మహోత్తర పోరాటమని, దీని ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం మనదేశంలో విలీనమైందని తెలిపారు.
