- తుది తీర్పు మానవ మేధస్సు పరిధిలోనే ఉండాలి
- సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
బెంగళూరు: ఏఐ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా ఉండాలి తప్ప.. ప్రాథమిక విధులను ఆక్రమించేలా ఉండకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. శనివారం కర్నాటక జ్యుడీషియల్ అకాడమీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- వివాదాల నివారణ, పరిష్కారం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.
భారీ డేటాను విశ్లేషించడానికి, రికార్డులను నిర్వహించడానికి ఏఐ అద్భుతంగా తోడ్పడుతుందన్నారు. అయితే, తీర్పులు వెలువరించడం వంటి కీలకమైన న్యాయ విధుల్లో ఏఐ జోక్యం చేసుకోవడం తగదన్నారు. న్యాయ నిర్ణయాల్లో ఏఐ సాధనాల ఆధిపత్యం పెరిగితే వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తుది తీర్పు మానవ మేధస్సు పరిధిలోనే ఉండాలని తెలిపారు. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రూ మాట్లాడుతూ.. ఏఐ ద్వారా వివాదాలను ముందే అంచనా వేయవచ్చని చెప్పారు. అయితే, ఇది న్యాయమూర్తులకు ప్రత్యామ్నాయంగా మారుతుందా.. అనే ఆందోళనను వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఏఐ వల్ల కోర్టు తీర్పులు వేగంగా స్థానిక భాషల్లోకి అనువదించబడుతున్నాయని, గ్రామీణులకు న్యాయం మరింత చేరువవుతోందని తెలిపారు.
