 
                                    - నోటిఫికేషన్ జారీ చేసిన న్యాయ శాఖ
- వచ్చే నెల 24 బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ ఇటీవల జస్టిస్ సూర్యకాంత్‌ను తన సక్సెసర్‌గా సిఫార్సు చేశారు. దానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం ఆమోదం తెలపారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని జస్టిస్ డిపార్ట్‌మెంట్ జస్టిస్ సూర్యకాంత్ నియామకాన్ని కన్ఫామ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
దీంతో జస్టిస్ సూర్యకాంత్.. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతేగాక, సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ పదవిలో ఆయన 14 నెలల(2027 ఫిబ్రవరి 9)పాటు కొనసాగనున్నారు.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి..
జస్టిస్ సూర్యకాంత్.. 1962 ఫిబ్రవరి 10న హర్యానా హిస్సార్ జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.1984 లో లా పట్టా పొంది..2001లో సీనియర్ అడ్వకేట్ గా మారారు. 2018 అక్టోబరు 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ బెంచ్ ల్లో విధులు నిర్వర్తించిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు.
బిహార్ ఓటర్ల జాబితా, ఆర్టికల్ 370ని రద్దు, వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి కేసుల తీర్పుల్లో కీలకపాత్ర పోషించారు.

 
         
                     
                     
                    