2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : జ్యోతిరాదిత్య సింధియా

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్  : జ్యోతిరాదిత్య సింధియా

 

  • 2030 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా మోదీ పాలన
        

హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి ప్రపంచంలోనే సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్​ను తీర్చి దిద్దడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకెళ్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మోదీ గత పదేండ్లుగా ప్రజాస్వామ్యయుతంగా, సుపరిపాలన అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవ‌‌‌‌స్థగా ఎదిగిందని, 2030 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా మోదీ పాలన అందిస్తున్నారని చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్​ఆఫీస్​లో సింధియా మీడియాతో మాట్లాడారు. హవాయ్ చెప్పులు ధరించే వ్యక్తిని విమానంలో చూడాలన్నదే ప్రధాని మోదీ కల అని, అందులో భాగంగానే ఉడాన్ స్కీమ్ తో సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం చేరువయ్యేలా చేశారని చెప్పారు. ఉడాన్ పథకం కింద 517 మార్గాలు ప్రారంభమయ్యాని తెలిపారు. మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఎయిర్ క్రాప్ట్ మెయింటనెన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించగలిగే ఏవియేషన్ స్కూల్ అయిన జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ను హైదరాబాద్​లో ప్రారంభించామని తెలిపారు. బేగంపేట ఎయిర్​పోర్ట్​లో అంతర్జాతీయ ప్రమాణాలతో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం రూపుదిద్దుకుంటోందని చెప్పారు.

లోక్​సభ ఎన్నికల్లో వారధులుగా నిలవాలి

రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర, జిల్లా పార్టీ అధికార ప్రతినిధులు పార్టీకి, ప్రజలకు మధ్య వారధులుగా నిలవాలని సింధియా సూచించారు. పార్టీ స్టేట్​ఆఫీసులో రాష్ట్ర పార్టీ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా వర్క్ షాప్ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ లోక్​సభ అభ్యర్థుల గురించి జనాలకు వివరించాలని సూచించారు. బీజేపీపై ప్రతిపక్ష పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ సుపరిపాలనను ప్రతి ఓటరుకు తెలియజేయాలని సూచించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి : జాఫర్ సయ్యద్ ఇస్లాం

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచా రాన్ని తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ సయ్యద్ ఇస్లాం సూచించారు. పార్టీ స్టేట్​ఆఫీసులో ఆయన మీడియా వర్క్ షాపును ప్రారంభించి మాట్లాడారు. పార్టీని  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత యాక్టివ్​గా పనిచేయాలన్నారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, ఎంపీ ఎన్నికల్లో  మెజారిటీ సీట్లనుగెలిచేలా పలు ప్రోగ్రామ్స్ నిర్వహించాలని కోరారు. ఎన్వీ సుభాష్, ప్రేమేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.