పాతబస్తీలో సింధియా బిజీ బిజీ

పాతబస్తీలో సింధియా బిజీ బిజీ

హైదరాబాద్ లో కేంద్ర మంత్రి సింధియా జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగుతోంది. లోక్‌సభ ప్రవాస్ యోజన (Loksabha Pravas Yojana)లో భాగంగా హైదరాబాద్‌ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌ సింధియా.. పాతబస్తీలో కార్యకర్తలు, పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలోపేతంపై ఆయన చర్చిస్తున్నారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పర్యటనకు సంబంధించిన విషయాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. శనివారం గౌలిగూడలోని ఉస్మాన్ షాహిలోని శ్రీ జంగిల్ విఠోబా దేవాలయాన్ని సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు ఆనందంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ తెలంగాణలోని 7 ఫ్రంట్ ల అధ్యక్ష, కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. ఎదుర్కొంటున్న సవాళ్లపై వారితో ఆయన చర్చించారు. త్వరలోనే జరిగే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి.. సూచనలు, సలహాలు అందచేశారు. చార్మినార్ ప్రాంతానికి చేరుకున్న సింధియా.. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. మూడో డోస్ తీసుకుంటున్న వారితో ఆయన ముచ్చటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కోవిడ్ వ్యాక్సినేషన్ లు రాష్ట్రాలకు పంపించడం జరుగుతోందని అక్కడున్న వారికి వివరించారు.

వ్యాక్సిన్ లు భారతదేశంలోనే తయారు చేయబడ్డాయన్నారు. అక్కడి నుంచి నేరుగా కార్వాన్ ప్రాంతానికి చేరుకున్నారు. సత్యనారాయణ నగర్ లో యువకులతో నిర్వహించిన సమావేశంలో సింధియా పాల్గొని ప్రసంగించారు. మొదటిసారిగా ఓటు వేయడానికి అర్హులైన యువతను కలుసుకుని వారి కోరికలు, ఆంక్షాంక్షలు తెలుసుకోవడం జరిగిందన్నారు. అనంతరం బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వారికి వివరించారు. వరి గింజలపై చిత్రాలు గీసే కళాకారుడిని ఆయన కలుసుకున్నారు. అతని గీసిన చిత్రాలను చూసి మంత్రముగ్ధుడయ్యాయని, భారతీయ కళను సజీవంగా ఉంచుతున్న కళాకారులకు వందనం తెలియచేస్తున్నట్లు తెలిపారు. మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, గోషామహాల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిని  సింధియా దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగింది.