కుల వివక్షపై పోరాడిన మహనీయుడు పూలే : అంబేద్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి

కుల వివక్షపై పోరాడిన మహనీయుడు పూలే : అంబేద్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి
  • అంబేద్కర్​ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి

హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని అంబేద్కర్​ఓపెన్​ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ​ఘంటా చక్రపాణి కొనియాడారు. హైదరాబాద్​లోని వర్సిటీలో శనివారం పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యలో సమాన అవకాశాలు ఉండాలని పూలే వాదించేవారని తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి నియంత్రణ సంస్థలు పక్షపాతం లేకుండా పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

భవిష్యత్ తరాలకు ఆదర్శం 

పూలే పోరాటం భవిష్యత్​తరాలకు ఆదర్శమని సామాజికవేత్త డాక్టర్​ సంగిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దేశంలో మహిళల విద్య, హక్కుల కోసం ఆయన పోరాడారని చెప్పారు. పూలే రచనలను భావితరాలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ జి.పుష్ప చక్రపాణి మాట్లాడుతూ.. అంబేద్కర్, పూలే సిద్ధాంతాలు ఆచరణీయమని తెలిపారు.  విద్యార్థులు మహనీయుల జీవిత గాథలను తెలుసుకోవాలని సూచించారు.

పూలే చిత్ర యూనిట్​కు అభినందన

అంబేద్కర్​వర్సిటీ ఆడిటోరియంలో పూలే తెలుగు సినిమా ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సినిమా నిర్మాత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం, సాధికారత పోరాటంలో పూలే కృషికి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. సినిమా విడుదలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రవిచంద్ర, మాటల రచయిత కత్తి చేతన్ ను ఘంటా చక్రపాణి సన్మానించారు. 

చిత్ర యూనిట్ ను అభినందించారు. కార్యక్రమంలో బీసీ సెల్ కో-ఆర్డినేటర్ రమాదేవి, ఇన్​చార్జి రిజిస్ట్రార్ ఎన్ సీ.వేణుగోపాల్, ప్రొఫెసర్​ఆనంద్ పవార్, వీసీ ఓఎస్డీ రబింద్రనాథ్ సోలమన్, ప్రొఫెసర్​పల్లవి కాబడే, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ కుమార్, విశ్వనాథ్, మియాజాని, యకేశ్ దైదా తదితరులు పాల్గొన్నారు.