ఉస్మానియాకు బిల్డింగ్ ఎందుకు కట్టలే? : టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న

ఉస్మానియాకు బిల్డింగ్ ఎందుకు కట్టలే? : టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న

హైదరాబాద్‌‌, వెలుగు: ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌‌ ఎనిమిదేండ్లు అవుతున్నా ఎందుకు కట్టలేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ప్రశ్నించారు. గురువారం ఎన్టీఆర్‌‌ ట్రస్ట్‌‌ భవన్‌‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘2015 జులై 22న కేసీఆర్ ఉస్మానియా హాస్పిటల్‌‌ ను సందర్శించారు. వారంలోగా హాస్పిటల్‌‌ ఖాళీ చేయిస్తాం. ఏడాదిన్నరలో కొత్త భవనాన్ని నిర్మిస్తాం. ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతాం. ఉస్మానియా ప్రతిష్టను నిలబెట్టేలా ట్విన్‌‌ టవర్స్‌‌ నిర్మిస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకూ బిల్డింగ్ కట్టలేదు” అని ఆమె మండిపడ్డారు.

సర్కారు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం, నిమ్స్ లో దశాబ్ది బ్లాక్ కు శంకుస్థాపన చేయడం సంతోషమేనని, కానీ పేదోడికి వైద్యం అందించే ఉస్మానియా సంగతి ఏమైందని ప్రశ్నించారు. సీఎం కనీసం ఉస్మానియా పేరును మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదన్నారు. ఉస్మానియాలో 21 డిపార్ట్ మెంట్లు, 1,168 పడకల సామర్థ్యం ఉందని, అలాంటి దవాఖానపై నిర్లక్ష్యం ఏమిటని విమర్శించారు. హైదరాబాద్ కు నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారని, అవి కూడా ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు.