న్యూఢిల్లీ: ఇండియా క్రికెటర్, కర్నాటక స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అన్ని ఫార్మాట్ల ఆటకు సోమవారం వీడ్కోలు పలికాడు. 14 ఏండ్ల పాటు ఇండియాలో
ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన గౌతమ్‌కు లోయర్ ఆర్డర్‌లో మంచి హిట్టర్‌గా పేరుంది. 2012 రంజీ ట్రోఫీలో కర్నాటక తరఫున అరంగేట్రం చేసిన గౌతమ్.. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సురేశ్ రైనా, భువనేశ్వర్ వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
2016–17 రంజీ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీసి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఫస్ట్ క్లాస్, లిస్ట్–ఎ క్రికెట్‌లో మొత్తం 320కి పైగా వికెట్లు తీశాడు. బ్యాట్‌తో మంచి ఇన్నింగ్స్ ఆడిన గౌతమ్ 2023 వరకు కర్నాటక జట్టుకు ప్రధానమైన ఆల్‌రౌండర్‌గా సేవలందించాడు. 2021లో ఇండియా సీనియర్ టీమ్‌కు ఎంపికైన గౌతమ్ శ్రీలంకపై ఏకైక టీ20 మ్యాచ్ ఆడి ఓ వికెట్ తీశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2021లోనే సీఎస్కే అతన్ని రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో గౌతమ్ మొత్తంగా రూ. 35 కోట్లు ఆర్జించాడు.
