న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని లక్ష్మణ్ ఆరోపించారు. కేబినెట్ భేటీలో హామీల అమలు, నిధుల కేటాయింపులపై స్పష్టత లేదని, అసలు ‘రైతు భరోసా’ ఊసే ఎత్తకపోవడం దారుణమని మండిపడ్డారు.
రాష్ట్ర సంపదను అభివృద్ధికి వాడకుండా, ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టడానికే రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం ఢిల్లీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ‘నయానిజాం’ లా వ్యవహరిస్తున్నరని.. ముస్లిం ఓట్ల కోసం పాకులాడుతూ రాజ్యాంగ పదవికి కళంకం తెస్తున్నారని విమర్శించారు.
మూసీ ప్రాజెక్టు పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, కానీ, అభివృద్ధి అంటే ప్రజలకు నష్టం కలిగించడం కాదని హితవు పలికారు. ప్రభుత్వం కేవలం భూముల చుట్టూ రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నదని విమర్శించారు. హేట్ స్పీచ్‌పై చట్టం చేస్తామంటున్న రేవంత్ రెడ్డి.. ముందుగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసే ఎంఐఎం నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు ఏం మాట్లాడినా కాంగ్రెస్ నాయకులు ‘కుక్కిన పేను’లా మౌనంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు.
