60 ఏండ్లలో కులగణన ఎందుకు చేయలే : కె. లక్ష్మణ్

60 ఏండ్లలో కులగణన ఎందుకు చేయలే : కె. లక్ష్మణ్
  • కాంగ్రెస్ హయాంలోరాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్ల అమలు
  • ఫోన్ ట్యాపింగ్​పై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్ల పాటు అధికారంలో ఉన్నా.. కులగణన ఎందుకు చేయలేదని బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు కులగణనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో రిజర్వేషన్లను రాజ్యాంగానికి విరుద్ధంగా అమలు చేశారని విమర్శించారు. ఇప్పుడు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్​కు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేదని, తన బిడ్డ కవితకు బెయిల్ ఇవ్వడం లేదంటూ ఓ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని అన్నారు. 

శనివారం ఆయన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్​పై చట్ట పరంగా, రాజకీయ పరంగా పోరాటం చేస్తామన్నారు. ఫోన్​ట్యాపింగ్​పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సమగ్ర విచారణ చేయించడంలేదని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పగటికలలు కంటున్నారని, కానీ ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడి దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని.. దేవుళ్లను అడ్డం పెట్టుకుని ఆయనే రాజకీయాలు చేస్తున్నారన్నారు. 

మసీదునూ చందాలతో కట్టుకోవచ్చు.. 

బీజేపీకి కులం, మతం లేదని, అందరినీ సమానంగా చూస్తామని లక్ష్మణ్ ప్పారు. తాము చేసేదే సంకల్ప పత్రంలో చెప్పామన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రభుత్వం చేపట్టలేదని, ప్రజలే తమ విరాళాలతో నిర్మించారన్నారు. బాబ్రీ మసీదు నిర్మాణానికి సుప్రీంకోర్టు భూమిని అలాట్ చేసిందని, దానిని కూడా విరాళాలతో నిర్మించుకోవచ్చన్నారు. ఆ ల్యాండ్​లో మసీదు కట్టుకుంటే ఎవరూ అడ్డుకోరన్నారు. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకూడదని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలి వంద రోజుల్లోనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.

 ఐదేండ్ల ప్లాన్ ఇప్పటికే రెడీ చేస్తున్నామన్నారు. కమ్యూనిస్టుల ఐడియాలజీ పాత చింతకాయ పచ్చడిలాంటిదని, అందుకే ఆ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. రాజ్యాంగ సంస్థల మీద కమ్యూనిస్టులకు నమ్మకం లేదన్నారు. చైనా సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకే కమ్యూనిస్టులు ఇక్కడ అస్తిత్వాన్ని కోల్పోయారన్నారు. కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని, అందుకే కమ్యూనిస్టులను తిట్టి.. మళ్లీ వాళ్లతోనే కలిసి పోటీ చేస్తోందన్నారు. మెడకాయ మీద తలకాయ లేనోళ్లే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటని ప్రచారం చేస్తారని విమర్శించారు.