దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా: కె. లక్ష్మణ్

దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా: కె. లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులను దగా చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఆయన మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ముషీరాబాద్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో అభివృద్ధి, విజయాలను ప్రచారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 80 శాతం దళారుల జేబుల్లోకి వెళ్లేవి.. ప్రస్తుతం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తున్నామని చెప్పారు.

కానీ దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని స్వయంగా సీఎం అనడం దురదృష్టకరమన్నారు. ఎవరిది అవినీతి పాలన అనేది ఈ ఒక్క మాటతో స్పష్టమవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత పాలన కావాలని కోరుకుంటున్నారని, డబుల్ ఇంజన్ సర్కార్​తోనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, బద్రి నారాయణ, జమాల్పూర్ నందు, అనిల్ కుమార్, కంచి, వాసు 
తదితరులు పాల్గొన్నారు.