రైల్వే పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి : సీఎస్ రామకృష్ణా రావు

రైల్వే పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి : సీఎస్ రామకృష్ణా రావు
  •     అధికారులకు సీఎస్​ రామకృష్ణా రావు ఆదేశం
  •     పెండింగ్​ పనులపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టు పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎస్​కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అపరిష్కృత అంశాలపై మంగళవారం సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైల్వే అండర్  బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రజా రవాణా మరింత మెరుగుపర్చడం తదితర 21 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులపై వివిధ శాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించి పరిష్కార మార్గాలు చూపాలన్నారు. 

రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశాలపై త్వరలోనే రైల్వే ఉన్నతాధికారులతో సమావేశముందని, ఈలోపు పెండింగ్ పనులపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్​ సీఎస్​లు జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు పాల్గొన్నారు. అలాగే,  అమెరికా, -భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ నుంచి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో సీఎస్​కె.రామకృష్ణారావుతో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిపై ప్రతినిధి బృందానికి వివరించారు.