చండూరులో అధికారులపై కేఏ పాల్ ఫైర్

చండూరులో అధికారులపై కేఏ పాల్ ఫైర్

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికారులపై చిందులు తొక్కారు. తెలంగాణకు కాబోయే సీఎంనైన.. తనన్నే అడ్డుకుంటారా..? అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఉప ఎన్నికలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ ఇవాళ చండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు ప్రచార వాహనాల్లో నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. కేఏ పాల్ ను షాడో పార్టీలా అనుసరిస్తూ వచ్చిన అధికారులు చండూరు వద్ద అడ్డుకుని ప్రశ్నించారు. మైక్ పర్మిషన్ ఉందా.. ? వాహనాల పాసులు ఏవి అంటూ అధికారి కేఏ పాల్ ను ప్రశ్నించారు. తాను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్నట్లు పాల్ చెప్పారు. దీంతో పర్మిషన్ పాసులు కనిపించనందునే అడ్డుకున్నామని సదరు అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. 

పక్కనున్న వాహనంలో మైకు సౌండు వల్ల మాటలు సరిగా వినిపించకపోవడంతో పాల్, అధికారులు బిగ్గరగా మాట్లాడుకున్నారు. ‘‘ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నన్ను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ..’’ కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. తాను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రినని.. రెస్పెక్ట్ ఇవ్వాలని మండిపడ్డారు. తన కారును ఆపి ప్రశ్నిస్తున్న అధికారిని నీ పేరు ఏమిటంటూ ఆయన మెడలోని ఐడి కార్డు లాక్కుని పేరు చూసే ప్రయత్నం చేశారు. ఆయన వెంటనే ఐడీ కార్డును లాక్కోగా..  ఈయన పేరు ఏంటని కేఏ పాల్ అధికారి పక్కనున్న వారిని ప్రశ్నించారు. డ్యూటీలో భాగంగా ప్రశ్నిస్తున్న అధికారులు తమ డ్యూటీ తాము చేస్తున్నామంటూ సర్ది చెప్పడంతో కేఏ పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.