కూసుకుంట్లకు లక్ష ఓట్లు పడ్డాయంటే నవ్వొస్తోంది : కేఏ పాల్

కూసుకుంట్లకు లక్ష ఓట్లు పడ్డాయంటే నవ్వొస్తోంది  : కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నికలో తనకు కేవలం 800 ఓట్లే ఎలా వస్తాయని.. ఓట్లు గల్లంతు అయినందుకు బాధపడుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. ‘‘టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు లక్ష ఓట్లు పడ్డాయంటే నవ్వొస్తోంది. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటా’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈవీఎంలు మార్చారు ... జిల్లా అధికారులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు’’ అని విమర్శించారు. ఈవీఎంలు మార్చడంలో అధికారుల పాత్ర ఉందన్న ఆయన.. అవినీతి చేసిన ఎన్నికల అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మునుగోడులో ఏం చేశారని సీఎం కేసీఆర్ కు ప్రజలు ఓటేస్తారని ప్రశ్నించారు. క్రిస్టియన్ సంఘాల 25వేల ఓట్లు ఎక్కడ ? అని కేఏ పాల్ ప్రశ్నించారు. తాను నిర్వహించిన సభలకు వందల నుంచి వేల మంది ప్రజలు తరలివచ్చారన్నారు. ఆ ప్రజల ఓట్లన్నీ ఎక్కడికి పోయాయన్నారు.  

కలెక్టర్ సీఎం కేసీఆర్ తొత్తులాగా వ్యవహరించారని ఆరోపించారు. మంత్రులు, వంద మంది ఎమ్మెల్యేలు, ఎంతో మంది మునుగోడుకు వచ్చి ప్రలోభాలు పెట్టారా ? లేదా ? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే తనను అభ్యర్ధిగా ప్రకటించకుండా కుట్ర పన్నారని విమర్శించారు. ధర్నా చేసిన అనంతరం అభ్యర్ధిగా ప్రకటించారని తెలిపారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు వద్దు.. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని గతం నుంచి డిమాండ్ చేస్తున్నానని వెల్లడించారు.