
- వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
సికింద్రాబాద్, వెలుగు : తెలంగాణ నుంచి కర్నాటకకు వెళ్లే కాచిగూడ– యశ్వంత్‌పూర్(610కిమీ) వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇందుకోసం కాచిగూడ రైల్వేస్టేషన్లో రైల్వే అధికారులు ఉదయం 10.30కు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం రైలు కాచిగూడ నుంచి బయలుదేరి యశ్వంత్ పూర్ వెళుతుంది. తిరిగి ఈ నెల25న యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి కాచిగూడకు రాత్రి 11.15కు చేరుకుంటుంది. –
ఇది తెలంగాణ(హైదరాబాద్), ఏపీ, కర్నాటక(బెంగళూరు)లను కలుపే మొదటి వందే భారత్ రైలు కావడం విశేషం. రైలు మార్గమధ్యలో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. బుధవారం మినహా వారంలో 6 రోజులు సర్వీసులో ఉంటుంది. కాచిగూడ నుంచి యశ్వంత్ పురాకు ఏసీ చార్జీని రూ. 1600గా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,915గా నిర్ణయించారు.