
- బీఆర్ఎస్లో కొందరు పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించారు
- వరంగల్లో బీఆర్ఎస్గెలిచే పరిస్థితి లేదు
- ఓడిపోయే పార్టీ నుంచి కావ్యను పోటీ చేయించకూడదనుకున్నం
- తన లాగే తన బిడ్డనూ ఆశీర్వదించాలని వినతి
- స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ నేతలతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు బీఆర్ఎస్లో ఉన్నా తాను ఒక్క తప్పు కూడా చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలు చేయలేదన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకోలేదని అన్నారు. చాలా మంది పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆయన విమర్శించారు. తనను విమర్శించే నైతికత ఏ ఒక్కరికీ లేదన్నారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క కేసు కూడా తనపై లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాటికొండ రాజయ్య గానీ, అరూరి రమేష్ గానీ, పసునూరి దయాకర్ గానీ పార్టీ మారినప్పుడు ఎవరూ మాట్లాడలేదని, తాను మారుతానంటే మాత్రం అందరూ మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చాలా మంది అయోమయంలో ఉన్నారని, పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నదని తెలిపారు. ‘‘బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్నా పోటీ చేయాలనుకున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. జిల్లాలో బీఆర్ఎస్ బాగా బలహీనపడింది. జిల్లా నాయకుల నుంచి సహకారం లభించడం లేదు. సమావేశాలు పెడదామంటే ఏవేవో కారణాలు చెప్తున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. మొదటి సారి పోటీ చేస్తున్న కావ్యను ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయించొద్దని అనుకున్నాం. అందుకే ఆ పార్టీని వీడాం. నియోజకవర్గ నాయకులు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నేతలు వచ్చి పార్టీలో చేరాల్సిందిగా కోరారు. నన్ను ఆశీర్వదించినట్టే నా కూతురునూ ఆశీర్వదించండి” అని శ్రీహరి పేర్కొన్నారు.
పార్టీ మారకముందే విమర్శలు..
పార్టీ మారకముందే తనపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. ‘‘అవకాశలు అందరికీ వస్తాయి. వచ్చిన అవకాశాలను ఏవిధంగా ఉపయోగించుకున్నాం అనేదే ముఖ్యం. కొంత మంది నెలల తరబడి పార్టీలో చేరతామని వాళ్ల ఇళ్ల చుట్టూ తిరిగారు. అయినా చేర్చుకోలేదు. కానీ, వాళ్లే మన ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని అడుగుతున్నారు. కొంత మంది వచ్చిన అవకాశాలను చెడగొట్టుకొని ఎదుటి వాళ్లపై విమర్శలు చేస్తున్నారు. నన్ను ప్రశ్నించే హక్కు ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఉంది’’ అని శ్రీహరి చెప్పారు. తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు పదేండ్లు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఉన్నారని తెలిపారు.
కార్యకర్తలను కాపాడుకునేందుకే: కావ్య
అందరూ ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీలు మారుతారని, కానీ, కడియం శ్రీహరి మాత్రం నియోజకవర్గ కార్యకర్తలను కాపాడుకునేందుకే పార్టీ మారుతున్నారని కడియం కావ్య అన్నారు. ఇంకా పార్టీ మారకముందే అందరూ ఏవిధంగా విమర్శిస్తున్నారో చూస్తున్నామన్నారు. ఎవరి ఎలాంటి వారో తెలిసిపోయిందన్నారు. ఇంటి బిడ్డగా నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.