రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కాకా జయంతి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కాకా జయంతి వేడుకలు

కాకా 90వ  జయంతి  సందర్భంగా  అభిమానులు , ప్రజలు  ఘన నివాళులు  అర్పించారు. ట్యాంక్ బండ్  సాగర్ పార్కులో  కాకా విగ్రహం  దగ్గర ఏర్పాటు  చేసిన  కార్యక్రమంలో ప్రముఖులు  పాల్గొన్నారు. ఈ  కార్యక్రమానికి   కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మణ్, మాజీ ఎంపీ  వివేక్, మాజీ మంత్రి  వినోద్, సీనియర్  నాయకులు కేకే, డీఎస్,  శంకర్ రావు,  కొండా  విశ్వేశ్వర్ రెడ్డి,  రాములు  సహా… పలువురు కాకా అభిమానులు  హాజరయ్యారు. కాకా  కుటుంబ సభ్యులు  ఈ కార్యక్రమంలో  పాల్గొని  నివాళి అర్పించారు.

పేదల  జీవితాల్లో  వెంకటస్వామి వెలుగులు  నింపారని  అన్నారు  కేంద్రహోంశాఖ  సహాయ మంత్రి కిషన్ రెడ్డి.  కాకా చేసిన  సేవలను  గుర్తు చేసుకున్నారు. కార్మికుల  హక్కులు  కాపాడి  పెన్షన్లు ఇచ్చారని  చెప్పారు  కిషన్ రెడ్డి. బడుగు  బలహీన వర్గాలకు  కాకా అండగా నిలిచారని  అన్నారు  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మణ్. 1969లోనే  తెలంగాణ ఉద్యమానికి కాకా  ఊపిరి  పోశారన్నారు. మలిదశ  తెలంగాణ  ఉద్యమంలోనూ  కాకా కీలకపాత్ర పోషించారని   లక్ష్మణ్ గుర్తు  చేసుకున్నారు. కార్మికులకు  పెన్షన్లు ఇచ్చిన  ఘనత  కాకాదే అన్నారు  మాజీ మంత్రి   వినోద్. 6 కోట్ల  కార్మిక కుటుంబాలకు  మేలు జరిగిందన్నారు.

పేదలకు  గుడిసెలు వేసి   కాకా ఆశ్రయం కల్పించారని,  పేదల పెన్నిధిగా  కాకాను  గుర్తు చేసుకున్నారు  సీనియర్  నాయకుడు   కే.కేశవరావు.  పేదల బతుకుల్లో  కాకా వెలుగులు నింపారని  అన్నారు   మాజీ మంత్రి శంకర్రావు.  వెంకటస్వామి ఆశీస్సులతో   ఏడాది క్రితం ఇదే రోజు  వెలుగు పేపర్   ప్రజల ముందుకు  తీసుకొచ్చామన్నారు  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.  విశ్వసనీయత  , ప్రజల నమ్మకాన్ని  వెలుగు దినపత్రిక  సంపాదించి సర్క్యులేషన్  పెంచుకుందని  చెప్పారు. తెలంగాణ  ఉద్యమంలో   కాకా పెద్దదిక్కుగా  ఉన్నారని  చెప్పారు  కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

కాకా 90 వ  జయంతి సందర్భంగా  ఆయన చేసిన  సేవలను  గుర్తు చేసుకున్నారు  మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్. సూర్యాపేట జిల్లాలో  జరిగిన  కాకా జయంతి  కార్యక్రమంలో  పొన్నం పాల్గొన్నారు.  నేటి యువతకు  కాకా జీవితం  స్ఫూర్తి  అన్నారు,  ప్రతి ఒక్కరూ  ఆయన అడుగుజాడల్లో  నడవాలని  పిలుపునిచ్చారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి 90వ జయంతి వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి, దేశానికి కాకా చేసిన సేవలను నేతలు గుర్తు చేశారు.