- మహబూబ్‌నగర్ జిల్లా ఎంసీఏ గ్రౌండ్స్‌లో ఇంటర్ డిస్ట్రిక్ టీ20 లీగ్
- విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో పోటీలు
- స్పోర్ట్స్ ఫ్లాగ్‌ను ఎగురవేసి పోటీలను ప్రారంభించిన మంత్రి వివేక్
- హాజరైన మంత్రులు అజారుద్దీన్, పొన్నం, వాకిటి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, హెచ్‌సీఏ సభ్యులు
మహబూబ్‌నగర్, వెలుగు: కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎండీసీఏ) పర్యవేక్షణలో ఎంసీఏ గ్రౌండ్స్‌లో ఇంటర్ డిస్ట్రిక్ టీ20 లీగ్ పోటీలను విశాక ఇండస్ట్రీస్ చైర్మన్, మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్‌సింగ్ ప్రారంభించారు. తొలుత వేదికపై కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందుస్టేడియంలో మంత్రి వివేక్ వెంకటస్వామి స్పోర్ట్స్ ఫ్లాగ్‌ను ఎగుర వేశారు. ఆ తర్వాత వివేక్ బౌలింగ్ చేయగా, మాజీ క్రికెటర్, మంత్రి అజారుద్దీన్ బ్యాటింగ్ చేశారు. అనంతరం వివేక్ బ్యాటింగ్ చేయగా.. మంత్రి వాకిటి శ్రీహరి బౌలింగ్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి కూడా క్రికెట్ ఆడారు. విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
క్రీడాకారులు గెలుపు కోసం పట్టుదలతో ప్రయత్నించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఈ టోర్నీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్‌లతో పాటు ప్రతి మ్యాచ్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ప్రైజ్‌మనీ అందజేస్తామని తెలిపారు. తాను గతంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఈ గ్రౌండ్‌కు వచ్చానని, అప్పుడు గ్రౌండ్ ఎర్రగా ఉండేదని, ఇప్పుడు స్టేడియంను తలపించేలా గ్రీన్‌గా మారిపోయిందని అన్నారు. త్వరలో ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేలా డెవలప్ చేస్తామని చెప్పారు. తాను హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈ టోర్నీని నిర్వహించామని తెలిపారు. అది సక్సెస్ కావడంతో ‘వెలుగు’ దినపత్రిక లాంచింగ్ టైంలో తెలంగాణలో జిల్లాస్థాయి టోర్నీలు నిర్వహించామన్నారు.
ఈ టోర్నీకి స్పాన్సర్‌షిప్ కావాలని హెచ్‌సీఏ యాడ్ ఇవ్వగా విశాక ఇండస్ట్రీస్ నుంచి టెండర్ వేశామని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని హెచ్‌సీఏ ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకి వచ్చేదని అన్నారు. ఇలాంటి టోర్నీల ద్వారా గ్రామీణ క్రీడాకారులను తయారు చేయొచ్చని, టాలెంట్ ఉన్న చాలా మంది క్రికెటర్లు బయటకు వస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌సీఏ 104 మ్యాచ్‌లు కండక్ట్ చేస్తుందని తెలిపారు. గ్రౌండ్‌ను అద్భుతంగా తయారు చేసిన మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన రాజశేఖర్, సురేశ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనరెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, జోగుళాంబ గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, యువ పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
ఇండియా టీమ్‌కు ప్రాతినిథ్యం వహించేలా శిక్షణ
అన్ని జిల్లాల్లో జరిగే ఈ టోర్నీ ద్వారా ప్రావీణ్యం ఉన్న క్రికెటర్లను గుర్తించి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తం. తెలంగాణ నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించేలా క్రీడాకారులను తయారు చేస్తం. క్రికెట్‌లో టాలెంట్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. అంతే తప్ప పైరవీలతో రావు. హెచ్‌సీఏ అంతర్గత రాజకీయాలు వదిలేయాలి. పాలమూరులో ఉన్నట్టు అన్ని జిల్లాల్లో స్టేడియాలను ఏర్పాటు చేసేందుకు హెచ్‌సీఏ చర్యలు తీసుకోవాలి.
- పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
మత్తు వదిలి మైదానాలకు రండి
యువత మత్తు వదిలి మైదానాలకు రావాలి. చాలా మంది విద్యార్థులు చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి మానసిక సమస్యల నివారణకు క్రీడలు ఒక్కటే మందు. రాష్ట్రం నుంచి మంచి క్రికెట్ ప్లేయర్స్ రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నది. మొన్న జరిగిన గ్లోబల్ సమిట్ లో క్రీడాశాఖకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ స్టేడియం చాలా బాగుంది. దీన్ని మరింత డెవలప్ చేస్తాం.
- వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి
స్టేడియమే కాదు..
క్రికెటర్లను కూడా తయారు చేయాలి మహబూబ్‌నగర్‌లోని స్టేడియంను ఇక్కడి నిర్వాహకులు చాలా బాగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ పిచ్‌పై గ్రీనరీ ఎక్కువగా ఉంది. దీన్ని కొద్దిగా సెట్ చేసుకోవాలి. లేకుంటే బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ మ్యాచులు కూడా నిర్వహించొచ్చు. పాలమూరులో స్టేడియమే కాదు.. ఈ స్డేడియం నుంచి క్రీడాకారు లను కూడా తయారు చేయాలి. అప్పుడే ఈ స్టేడియానికి ఒక అర్థం ఉంటుంది. ఎమ్మెల్యే వినోద్‌ను నేనెప్పటికీ మరిచిపోలేను. నేను క్రికెట్ ప్రాక్టీస్ చేసే రోజుల్లో ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు స్టేడియంకు వెళ్లే వాడిని. ఆ సమయంలో ఆయన నాకు ప్రతి రోజూ కడుపు నిండా అన్నం పెట్టేవారు.
- మహమ్మద్ అజారుద్దీన్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి
