జీడబ్ల్యూఎంసీ, కుడా పరిధిలో ఇల్లీగల్ దందాలు

జీడబ్ల్యూఎంసీ, కుడా పరిధిలో ఇల్లీగల్ దందాలు
  •  ఆఫీసర్ల లెక్కల్లో అరకొర మాత్రమే
  •  కొంతమంది సిబ్బందిపై అవినీతి ఆరోపణలు
  •  టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినా చర్యలు శూన్యం

హనుమకొండ, వెలుగు: కాకతీయ అర్బన్​ డెవలప్​ మెంట్ అథారిటీ(కుడా), వరంగల్ బల్దియా పరిధిలో అక్రమ వెంచర్ల దందా ఆగడం లేదు. ఎన్ని కంప్లైంట్స్​వచ్చినా ఆఫీసర్ల నుంచి ఎలాంటి యాక్షన్​ లేకపోవడం, క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది లంచాలకు అలవాటుపడడంతో రియల్టర్లు యథేచ్ఛగా ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్​ ఫోర్స్​ కమిటీ ఏర్పాటు చేసినా.. ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలోనే స్పెషల్ డ్రైవ్​లు చేపట్టి అక్రమ వెంచర్ల భరతం పడతామని చెప్పిన ఆఫీసర్లు..  ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.

వెంచర్లు వందల్లో.. లెక్కలు మాత్రం పదుల్లోనే..

వరంగల్ సిటీ చుట్టూ వందల సంఖ్యలో వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ప్రధానంగా రింగ్​ రోడ్డు చుట్టూరా ఉన్న వ్యవసాయ భూముల్ని నాలా కన్వర్షన్​ లేకుండానే ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. లేఅవుట్​ ఏర్పాటుకు పది శాతం ల్యాండ్ ను గుడి, బడి, పార్కులు ఇలా కనీస అవసరాల కోసం కేటాయించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. రింగ్​ రోడ్డు స్టార్ట్​ అయ్యే కరుణాపురం నుంచి దామెర క్రాస్​వరకు ఏర్పాటైన అన్ని వెంచర్లలో ఇదే పరిస్థితి. ఇందులో అన్ని రకాల పర్మిషన్లు ఉన్నవి 10 శాతం లోపే. కానీ ఆఫీసర్ల లెక్కల్లో మాత్రం ఆ సంఖ్య కనిపించడం లేదు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో మొత్తంగా 14  అక్రమ లే అవుట్లు ఉండగా.. కుడా పరిధిలో 200 వరకు ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య నాలుగైదు రెట్లకు మించి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

లైట్​ తీసుకుంటున్న ఆఫీసర్లు

అక్రమ వెంచర్లు, లేఅవుట్ల విషయంలో ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే ఆఫీసర్లు నామమాత్రంగా చర్యలు తీసుకుని, వదిలేస్తున్నారు. ఇంకొన్ని చోట్లా కనీస యాక్షన్​ కూడా ఉండటం లేదు. కొన్నిచోట్ల కుడా, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది  అవినీతికి అలవాటు పడటం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాల పరిధిలోని ఓ తొమ్మిది ఎకరాల భూమిలో వెంచర్​ ఏర్పాటు చేస్తున్నారు. ఓ మాజీ ఎంపీపీ  కుడాలోని ఓ పెద్దాఫీసర్​ సహకారం, జడ్పీ చైర్మన్​ సపోర్ట్​ తో ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ వెంచర్​ ఏర్పాటు చేస్తుండగా.. స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఇందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వరంగల్​ పైడిపల్లి, కొత్తపేటలోని ఈదుల చెరువును ఆక్రమించి వెంచర్​ ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు తేల్చినా దానిపైనా చర్యలు కనిపించడం లేదు. దామెర సమీపంలో ఓ పొలిటికల్​ లీడర్​ ఏర్పాటు చేసిన వెంచర్​ కు సరైన అనుమతులు లేకున్నా యాక్షన్ కరువైంది. వర్ధన్నపేట, ఐనవోలు సమీపంలో ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన వెంచర్లది కూడా ఇదే పరిస్థితి. వరంగల్​ నుంచి నర్సంపేట, ఖమ్మం రూట్లతో పాటు రింగ్​ రోడ్డు చుట్టుపక్కలా ఈ అక్రమ లేఅవుట్ల దందా జోరుగా సాగుతోంది. ఇదంతా ఆఫీసర్లకు తెలిసినా అక్రమార్కులపై మున్సిపల్​ యాక్ట్ 2019 ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి.. లైట్​ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.

టాస్క్​ ఫోర్స్​ ఉన్నా.. లేనట్టే..!

నాలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, అనాథరైజ్డ్​ లే అవుట్లపై యాక్షన్​ తీసుకునేందుకు జిల్లా స్థాయిలో గతంలోనే టాస్క్​ ఫోర్స్​ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో వరంగల్ సీపీ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్​ కమిషనర్​, ఇతర ఆఫీసర్లు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ కమిటీ ఇల్లీగల్​ కన్​ స్ట్రక్షన్స్​తో పాటు అక్రమ వెంచర్లపైనా యాక్షన్​ తీసుకోవాల్సి ఉంది. కానీ అక్రమ లేఅవుట్లను గుర్తించకపోగా.. ఆపై ఎలాంటి యాక్షన్​ తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్​ పరిధి వరకు అడపాదడపా అక్రమ లే ఔట్ల కాంపౌండ్లు కూల్చేస్తున్నా.. కుడా మాత్రం ఆ విషయాన్నే గాలికొదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఇకనైనా అక్రమ లే అవుట్లపై సీరియస్​ యాక్షన్​ తీసుకోవడంతో పాటు నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

టాస్క్ ఫోర్స్ రివ్యూ..

నాలాల ఆక్రమణలు, అక్రమ లేఅవుట్లు, వరద నివారణ చర్యలపై శనివారం టాస్క్ ఫోర్స్ కమిటీ రివ్యూ నిర్వహించింది. సీపీ డా.తరుణ్​జోషి, కలెక్టర్లు రాజీవ్​ గాంధీ హనుమంతు, గోపి, కమిషనర్ ప్రావీణ్య, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు. సిటీ పరిధిలోని నయీంనగర్​, బొంది వాగు, భద్రకాళి, శాకరాసి కుంట, కట్టమల్లన్న, చిన్న వడ్డేపల్లి నాలాల పరిరక్షణకు  ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలు, అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని,  కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు సంధ్యారాణి, హరీసింగ్, డీసీపీలు వెంకట లక్ష్మి, అశోక్ కుమార్, ఆర్ అండ్ బీ, ఐబీ ఎస్ఈ లు సుధాకర్ రెడ్డి, నాగేందర్ రావు, సిటీ ప్లానర్ బి.వెంకన్న, ఆర్డీవోలు వాసుచంద్ర, మహేందర్ జీ, సర్వే ల్యాండ్ ​ఏడీ ప్రభాకర్ రావు, ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.