హైదరాబాద్: కేఎల్ హెచ్ హైదరాబాద్ క్యాంపస్‌లో ‘కళా ఉత్సవ్ 2026’ జాతీయ స్థాయి సాంస్కృతిక మహోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించిన ఈ వేడుకలు ‘వేర్ ట్రెడిషన్ మీట్స్ క్రియేటివిటీ’ అనే థీమ్ తో సాగాయి. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా సాగిన ఈ వేడుకలో వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఈ ఉత్సవం మొదటి రోజున తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ప్రతినిధి నేహా సింగ్, బృంద సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సంగీతం, నృత్యం, సాహిత్యం, జర్నలిజం,‘లూమినార్’ షార్ట్ ఫిల్మ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. ప్రముఖ గాయకుడు పవన్ కల్యాణ్ తన మధురమైన గీతాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఫ్యాషన్ షో, టీం ఫన్ మోజీ ప్రదర్శనలు, ఇంటర్ క్యాంపస్ సాంస్కృతిక పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘కళాఉత్సవ్’ రెండో రోజు సినీ ప్రముఖులు అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్, నిహాంత్రి రెడ్డి హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా కేఎల్ హెచ్ వర్సిటీ అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు లక్షల రూపాయల విలువైన నగదు బహుమతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్లను అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా కేఎల్ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీశ్ మాట్లాడారు. కళా ఉత్సవ్ విద్యార్థుల సృజనాత్మకతకు ఒక గొప్ప వేదిక అని తెలిపారు. కేవలం విద్య మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, నాయకత్వ లక్షణాలు అలవడినప్పుడే విద్యార్థులకు సమగ్ర వ్యక్తిత్వం అలవడుతుందని పేర్కొన్నారు.
