కాళేశ్వరం విచారణ కంప్లీట్.. కేసీఆర్‎ను పిల్వరు.. హరీశ్, ఈటలతో మాట్లాడరు..!

కాళేశ్వరం విచారణ కంప్లీట్.. కేసీఆర్‎ను పిల్వరు.. హరీశ్, ఈటలతో మాట్లాడరు..!
  • కేసీఆర్ ను పిల్వరు!
  •  హరీశ్, ఈటలతో మాట్లాడరు
  •  కాళేశ్వరం విచారణ కంప్లీట్
  • అధికారుల అఫిడవిట్లు, విచారణలో చెప్పిన సమాధానాల ఆధారంగా నివేదిక
  • ఈ నెలాఖరు కల్లా ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్
  • 400 పేజీలతో నివేదిక సిద్ధం చేసిన కమిషన్

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది. బహిరంగ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‎ను పిలుస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్లను విచారణకు పిలవడం లేదు.

 దీంతో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లైంది. న్యాయ పరమైనచిక్కులు రావొద్దనే ఉద్దేశంతోనే వారిని విచారణకు పిలవొద్దని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్‌ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. దాదాపు 400 పేజీల రిపోర్ట్‌ను కమిషన్‌ తయారు చేసింది. 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను నియమించగా, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్‌ గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుంది. మూడు బ్యారేజీలపై విచారణ  ప్రారంభించిన కమిషన్ నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదికను పరిశీలించింది. దీంతోపాటు కాగ్ అభ్యంతరాలను అధ్యయనం చేసింది. 

ALSO READ | బావ బావమరిది రెండు గంటల డిస్కషన్..పార్టీ పగ్గాలపైనే చర్చించినట్టు టాక్.!

ఈ క్రమంలో విజిలెన్స్ రిపోర్టును కూడా తెప్పించుకొని పరిశీలించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న  ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఈఎన్సీలనూ విచారించింది. వారి నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలు.. విచారణలో చెప్పిన విషయాలను సరి చూసుకుంది. అదే  సమయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసింది. వారిని కూడా పిలిచి విచారించింది.

నిబంధనల ఉల్లంఘన.. ఏయే సంస్థల నుంచి ఎలా అప్పులు తెచ్చారు.. డిజైన్ ఫైనల్ చేసిందెవరు..? అన్న అంశాలపై కీలకంగా చర్చించింది. త్వరలోనే కేసీఆర్‎ను విచారణకు పిలుస్తారనే చర్చ విస్తృతంగా జరిగింది. నివేదిక ఫైనల్ చేసే సమయంలో పిలుస్తారనే ఊహాగానాలకు తెరలేచింది. కానీ న్యాయపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకొని ఈ ముగ్గురు నేతలను పిలవడం లేదని తెలుస్తోంది.