ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లో కాళేశ్వరం లొల్లి!

ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లో కాళేశ్వరం లొల్లి!
  • మేడిగడ్డ వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న ఇంజనీర్లు
  • తాము బాధ్యులం కాదని తప్పించుకునే ప్రయత్నం
  • రిపేర్లపై ఎల్​అండ్​టీ లేఖ తర్వాత వివిధ విభాగాల 
  • మధ్య ముదిరిన గొడవబ్యారేజీ పునరుద్ధరణ 
  • డిజైన్లపైనా మాటల యుద్ధం
  • సీనియర్ల తీరుతో జూనియర్​ ఇంజనీర్ల హైరానా
  • సంబంధం లేని వ్యవహారంలో  తమను ఎక్కడ ఇరికిస్తారోనని ఆందోళన

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లో లొల్లి మొదలైంది. డిపార్ట్‌‌మెంట్‌‌లోని సీనియర్​ ఇంజనీర్లు, ప్రాజెక్టు నిర్మాణంతో ముడిపడి ఉన్న ఇంజనీర్లు బయటికి ఒకరితో ఒకరు బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా వెనుక కత్తులు నూరుకుంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు తాము బాధ్యులం కాదన్నట్టు, తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అందరూ కలిసి ఫీల్డ్ ఇంజనీర్లదే బాధ్యత అన్నట్టుగా ప్రొజెక్ట్​ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో డిపార్ట్‌‌మెంట్‌‌లో ఏం జరుగుతుందోనని జూనియర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. 


గతంలో పొరపాటు జరిగితే అన్ని విభాగాల ఇంజినీర్లు సమిష్టిగా పని చేసి.. దాని పరిష్కారానికి ప్రయత్నించే వారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వరకు వచ్చే సరికి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్​ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేసిన ఘనత తమదేనని క్లెయిమ్​చేసుకున్న ఇంజనీర్లు.. ఇప్పుడు వైఫల్యాలను తమ నెత్తిన వేసుకోవడానికి సిద్ధంగా లేరు. బ్యారేజీ పునర్నిర్మాణంతో సంబంధం లేదంటూ ఎల్​అండ్​టీ లేఖ రాసిన నాటి నుంచి ఇరిగేషన్​ లోని వివిధ విభాగాల మధ్య అంతర్యుద్ధం స్పష్టంగా కనిపిస్తున్నది.

పునరుద్ధరణ డిజైన్‌‌పై పేచీ

కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించడానికి డిజైన్లు చేసే ఎక్స్‌‌పర్ట్ టీమ్‌‌ తమ వద్ద లేదని, మరో ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించాలని ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈ.. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌‌కు లేఖ రాశారు. దీంతో ఈ విషయం తమకు ముందే ఎందుకు చెప్పలేదని, ఎక్స్‌‌పర్ట్ టీమ్ లేకుంటే బయటి నుంచి హైర్​చేసుకొని డిజైన్లు చేయాలి గానీ ఇలా లేఖ రాయడం ఏమిటని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌‌ మండిపడింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పునరుద్ధరణ డిజైన్లను ఈనెల 30లోగా ఇవ్వాలని డెడ్​లైన్​ పెట్టారని, అలా మెడపై కత్తిపెట్టి ఒత్తిడి చేస్తే తాము డిజైన్లు చేసి ఇవ్వలేమని సీడీవో ఇంజనీర్లు వాపోతున్నారు. మేడిగడ్డ నిర్మాణ సమయంలో డిజైన్లపై సరిగా శ్రద్ధ తీసుకోలేదని, ఇప్పుడు పునరుద్ధరణ సమయంలోనూ ఒత్తిడి చేస్తే మొత్తం బ్యారేజీ భవిష్యత్​ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ఫీల్డ్​ఎక్స్​పీరియన్స్ ఉన్న ఇంజనీర్లు డిజైన్ల కోసం ఒత్తిడి ఎలా తెస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫీల్డ్​లో ఉన్న సీనియర్ ఇంజనీర్లు.. నిర్మాణ సంస్థ ఎల్అండ్​టీ చేస్తున్న కమ్యూనికేషన్స్‌‌ను హెడ్​క్వార్టర్స్‌‌కు సరిగా చేరవేయడం లేదని, దీంతో ప్రభుత్వానికి అప్పటికప్పుడు ఏం చెప్పుకోవాలో తెలియడం లేదని ఉన్నతాధికారులు వాపోతున్నారు.

పంప్‌‌హౌపై కొత్త భయం

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బుంగలతోనే ప్రభుత్వానికి ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇంజినీర్లు ఉండగా.. పంపుహౌస్‌‌లపై లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇరిగేషన్​డిపార్ట్​మెంట్ ఉలిక్కిపడింది. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌‌లను డిజైన్​చేసిన ఎత్తులో కాకుండా కిందికి నిర్మించారని, దీంతోనే అవి నిరుడు మునిగిపోయాయని పెంటారెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లోనూ వరద ఎక్కువ వస్తే అవి మునిగిపోవడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పంపుహౌస్‌‌ల మునక ఎవరి మెడకు చిక్కుకుంటుందోనని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. మేడిగడ్డ కుంగుబాటు, పంపుహౌస్‌‌ల మునకకు ఎవరో ఒకరిని బాధ్యులను చేసి తాము తప్పించుకోవాలనే ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. సీనియర్ల తీరుతో డిపార్ట్‌‌మెంట్‌‌లోని జూనియర్​ ఇంజినీర్లు హైరానా పడుతున్నారు. సంబంధం లేని వ్యవహారంలో తమను ఎక్కడ ఇరికిస్తారేమోనని భయపడుతున్నారు.