కేసీఆర్, హరీశ్, ఈటెలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు : గడువు పెంచింది ఇందుకే..!

కేసీఆర్, హరీశ్, ఈటెలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు : గడువు పెంచింది ఇందుకే..!

కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ తోపాటు.. ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు పంపించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఇంజినీర్లు, ఇతర అధికారులను విచారించిన కమిషన్.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్, అప్పటి మంత్రులు హరీశ్, ఈటెలను కూడా ప్రశ్నించాలని నిర్ణయించింది. 

ఇందులో భాగంగా.. 2025, మే 20వ తేదీన నోటీసులు పంపించింది. వీరి అభిప్రాయాలను సైతం తీసుకోవాలని భావించిన న్యాయ విచారణ కమిషన్.. జూన్ 5వ తేదీలోపు కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా హరీశ్, ఆర్థిక మంత్రిగా ఈటల ఉన్నారు.

కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ గడువును రాష్ట్ర ప్రభుత్వం  మరో రెండు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. మే 31తో కమిషన్​ గడువు ముగుస్తుండగా.. జులై 31 వరకు పొడిగించింది.  నిజానికి ఈ వారంలోనే  ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. ఇలాంటి టైమ్​లో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్​ గడువును మరో రెండు నెలలు పొడిగించడం, మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వెనుక మర్మమేమిటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కేసీఆర్, హరీశ్,ఈటలకు నోటీసులివ్వడంతో కమిషన్ గడువు పొడిగించింది ఇందుకే అంటూ చర్చించుకుంటున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్​ 21న కుంగిపోయింది. బ్యారేజీలోని ఏడో బ్లాక్​ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది.  దీనిపై అటు నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ ఏ), ఇటు విజిలెన్స్​ డిపార్ట్​మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు 
సమర్పించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జి జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ చైర్మన్​గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ను ఏర్పాటు చేసింది.