భక్తజనసంద్రంగా కాళేశ్వరం.. జూన్ 1తో ముగియనున్న సరస్వతి అంత్య పుష్కరాలు

భక్తజనసంద్రంగా కాళేశ్వరం.. జూన్ 1తో  ముగియనున్న సరస్వతి అంత్య పుష్కరాలు

మహదేవపూర్, వెలుగు: సరస్వతి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానం ఆచరించేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో కాళేశ్వరం జనసంద్రంగా మారింది. సోమవారంతో సరస్వతి పుష్కరాలు ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. 

పుష్కర స్నానం ఆచరించిన అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తేశ్వరస్వామి, శుభానందా దేవి, సరస్వతి మాతను దర్శించుకున్నారు. మెదక్  జిల్లా కొల్చారంకు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, శుభానందా దేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. 

ఆలయం తరపున చైర్మన్  మోహన్  శర్మ, ఈవో మహేశ్​ఆయనకు శేష వస్త్రాలు, సరస్వతి మాత జ్ఞాపికను అందజేశారు. జెన్కో సీఎండీ కృష్ణభాస్కర్  పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి, అనురాధ నక్షత్రం సందర్భంగా రిత్వికులు మహా రుద్ర హోమం నిర్వహించారు. భక్తుల శివ నామస్మరణ నడుమ నవరత్నమాల హారతి , తెప్పోత్సవం జరిగాయి.