కాళేశ్వరం ముంపు భూములకు.. పరిహారం ఇస్తలె

కాళేశ్వరం ముంపు భూములకు.. పరిహారం ఇస్తలె
  • బ్యారేజీల బ్యాక్​వాటర్​తో మునుగుతున్న వేల ఎకరాలు 
  • సర్వే చేసి వదిలేసిన సర్కార్  ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని రైతుల డిమాండ్​

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్​వాటర్​తో రెండేళ్లుగా వేలాది ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. ముంపు భూములను సేకరించి ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్​ ఆఫీసర్లు సర్వే చేసినప్పటికీ భూసేకరణలో సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని రైతులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కట్టింది. వీటి నిర్మాణంలో క్యాచ్​మెంట్​ నుంచి వచ్చే వరదను పట్టించుకోకుండా గోదావరికి వచ్చే వరదను మాత్రమే ఆఫీసర్లు లెక్కించారు. బ్యారేజీలు పూర్తిగా నిండేంతవరకు గేట్లు ఓపెన్​ చేయడం లేదు. దీంతో గోదావరికి వరదలు వచ్చినప్పుడు బ్యారేజీల బ్యాక్​వాటర్​తో ఓ వైపు, ఒకేసారి మొత్తం గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి పెరిగి మరోవైపు వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలవుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో మేడిగడ్డ గేట్లు ఆలస్యంగా ఎత్తడం వల్ల ప్రాణహిత వరద నదీ తీర ప్రాంతాలను ముంచెత్తింది. వేమనపల్లి, కోటపల్లి, చెన్నూర్, జైపూర్​ మండలాల్లో పత్తి, వరి పంటలు, మోటార్లు కొట్టుకుపోయాయి. తాజాగా రెండు రోజుల కిందట గోదావరి వరదల్లో కోటపల్లి నుంచి జన్నారం వరకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎకరాకు రూ.30 వేలకు పైగా నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. 
ముంపు వేలల్లో.. సర్వే వందల్లో..
మంచిర్యాల జిల్లాలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలోని ముంపు భూములను గత ఏడాదే సర్వే చేశారు. అన్నారం బ్యారేజీ పరిధిలో జైపూర్​ మండలం శివ్వారంలో 31.10 ఎకరాలు, చెన్నూర్​ మండలం సుందరశాలలో 5.32, బీరవెల్లిలో 14.36, నాగపూర్​లో 0.39 ఎకరాలను ముంపుగా గుర్తించారు. సుందిళ్ల బ్యారేజీ బ్యాక్​వాటర్​తో జైపూర్ ​మండలం టేకుమట్లలో 141.02, శెట్​పల్లిలో 78.30, ఇందారంలో 13, కాచన్​పల్లి 24.28, రామారావుపేట్​7.27, కుందారంలో రెండు ఎకరాలు, మంచిర్యాలలో 33.39, గర్మిళ్లలో 56.10, నస్పూర్​ మండలం తాళ్లపల్లిలో 7.34, నస్పూర్​ విలేజ్​లో​6.39, హాజీపూర్​మండలం వేంపల్లిలో 2.23, ముల్కల్లలో 3.39 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టు గుర్తించారు. వాస్తవ ముంపు వేల ఎకరాల్లో ఉంటే.. ఆఫీసర్లు వందల ఎకరాలు మాత్రమే మునుగుతున్నట్టు లెక్క తేల్చారు. వరదలు వచ్చినప్పుడు కాకుండా కేవలం బ్యారేజీలు నింపినప్పుడు మునిగిపోయే ప్రాంతాన్నే ముంపుగా గుర్తించడంపై రైతులు మండిపడుతున్నారు. తాజాగా సుందరశాలలో 500 ఎకరాలకు పైగా పంటలు మునిగిపోతే.. సర్వేలో 5.32 ఎకరాలను మాత్రమే గుర్తించారని రైతులు పేర్కొన్నారు. శుక్రవారం గ్రామానికి వచ్చిన కలెక్టర్​ భారతి హోళికేరిని అడ్డుకొని నిరసన తెలిపారు. 

పంటలు నష్టపోతున్నం
నాకున్న ఎకరంన్నర పొలం రెండేండ్లుగా సుందిళ్ల పార్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్లో మునుగుతోంది. టేకుమట్ల పంచాయతీ ఆఫీసులో రెండుసార్లు రైతులతో ఆర్డీవో, తహసీల్దార్​ మీటింగ్​లు పెట్టి భూముల వివరాలు సేకరించారు. ఆఫీసర్లు సర్వేల మీద సర్వేలు చేసి రిపోర్టులు పంపించారు. ఇప్పటికీ పంటలకు నయా పైసా పరిహారం రాలేదు. భూమి పరిహారం కూడా అందలేదు. – ఆడెపు రాజేశం, టేకుమట్ల, మంచిర్యాల జిల్లా