88 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు

88 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు
  • తెలంగాణ స్టేట్‌‌ స్టాటిస్టికల్‌‌ అబ్‌‌స్ట్రాక్ట్‌‌లో వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 88 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీళ్లు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నిర్మాణంలో ఉన్న అన్ని భారీ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు కంప్లీట్‌‌ అయితే 89.90 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుందని బుధవారం విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌‌ స్టాటిస్టికల్‌‌ అబ్‌‌స్ట్రాక్ట్‌‌ బుక్ లో ప్రభుత్వం వివరించింది. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 21.02 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నామని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 16.99 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని పేర్కొంది. ఈ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే తలపెట్టినవి కాగా, రాష్ట్రం వచ్చిన తర్వాత చేపట్టిన కాళేశ్వరం కింద పాక్షికంగా ఆయకట్టుకు నీళ్లిచ్చామని ప్రభుత్వం తెలిపింది. 
ప్రాజెక్టుల కింద సాగు ఇట్లా.. 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన రంగనాయకసాగర్‌‌, కొండపోచమ్మ ప్రాజెక్టుల కింద మొత్తం 88,144 ఎకరాలకు నీళ్లిచ్చినట్లు అబ్ స్ట్రాక్ట్ లో చూపారు. శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు కింద 9.68 లక్షల ఎకరాలు, ఎస్సారెస్పీ స్టేజీ -2 కింద 3.52 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ కింద 6.34 లక్షల ఎకరాలకు, సాగర్‌‌ ఆధారంగా చేపట్టిన ఏఎమ్మార్‌‌ ఎస్ఎల్బీసీ నుంచి 2.75 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్టుల పనులు పూర్తి చేసి వాటి కింద 6.07 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చినట్లు పేర్కొంది. మీడియం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల కింద 4.06 లక్షల ఎకరాలకు, 38,942 చెరువుల కింద 23,33,263 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని వెల్లడించింది. 640 ఐడీసీ లిఫ్టుల నుంచి 4,59,637 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నది. 
ఎస్సీలు 54 లక్షలు.. ఎస్టీలు 31 లక్షలు  
రాష్ట్ర జనాభా 2021 నాటికి 3,77,25,000గా ఉంది. దేశ జనాభాలో ఇది 2.8 శాతం. రాష్ట్ర జనాభాలో15 నుంచి 40 ఏండ్లలో లోపు వాళ్లు 43.6 శాతం ఉన్నారు. రాష్ట్ర జనాభా 2026 నాటికి 3.86 కోట్లకు, 2031 నాటికి 3.92 కోట్లకు, 2036 నాటికి 3.96 కోట్లకు చేరుతుంది. ఇక రాష్ట్రంలో ఎస్సీల జనాభా 54,08,800, ఎస్టీల జనాభా 31,77,940 ఉంది. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారు. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. మంచిర్యాలలో 24.72 శాతం, భూపాలపల్లిలో 22 శాతం మంది ఎస్సీలు ఉన్నారు. జనాభాలో ఎస్సీల వాటా అతి తక్కువగా హైదరాబాద్(6.28), మేడ్చల్ మల్కాజిగిరి(9.42) జిల్లాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ల్యాండ్​ హోల్డింగ్స్ ఎస్సీ, ఎస్టీలకే తక్కువగా ఉన్నాయి. 76 శాతం భూములు ఇతరుల చేతుల్లో ఉండగా, ఎస్సీ, ఎస్టీలకు 23.8 శాతం భూములే ఉన్నాయి. మొత్తం భూముల్లో ఎస్సీలకు 11.8 శాతం, ఎస్టీలకు 12%భూములు ఉన్నాయి. చిన్నరైతుల్లో 2.47 ఎకరాలలోపు ఉన్నవాళ్లే 88.3% ఉన్నారు. మరో 9.5 శాతం మంది 5 నుంచి 10 ఎకరాలలోపు వాళ్లు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో లిటరసీ రేట్ 66.5 శాతంగా నమోదైంది. ఇందులో మహిళలు 58 శాతం, పురుషులు 75 శాతం ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో స్టేట్ యావరేజ్ కంటే తక్కువ లిటరసీ ఉన్నది. ఎస్సీల్లో58.9 శాతం, ఎస్టీల్లో 49.5 శాతం లిటరసీ ఉన్నది. రూరల్​ ఏరియాల్లో 57.3 %, అర్బన్ ఏరియాల్లో 81.1% లిటరసీ నమోదైంది.  హైస్కూల్స్​లో డ్రాప్​ ఔట్లు పెరుగుతున్నయి.  ప్రైమరీ స్కూల్స్​లో డ్రాప్ ఔట్లు జీరో శాతానికి రాగా, హైస్కూల్స్​లో12.2 శాతం, అప్పర్​ ప్రైమరీ స్కూల్స్​లో 0.06% ఉన్నాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఎక్కువ డ్రాప్​ ఔట్స్ ఉన్నాయి.