
-
ప్రాజెక్టు వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు
-
సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది 80 వేల కోట్లు మాత్రమే
-
రిపేర్లు అయ్యే సరికి రూ. 1.50 లక్షల కోట్లకు చేరుతుంది
-
ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర
-
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్/ భూపాలపల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని నిర్మించిన కాళేశ్వరం జలాశయానికి ఇప్పటి వరకు 95 వేల కోట్లు ఖర్చు చేసిందని, దీని ద్వారా ఇప్పటి వరకు 97 వేల ఎకరాలకు మాత్రమే ప్రత్యక్షంగా నీరందుతోందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇవాళ ( డిసెంబర్ 29) మేడిగడ్డ బ్యారేజ్ పై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తాము మొదట ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని తుమ్మడి హెట్టి దగ్గర నిర్మించాలని భావించామని, అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా అక్కడే శంకుస్థాపన కూడా చేశారని చెప్పారు. 38 వేల కోట్లు ఖర్చు చేసి 16 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా నీరిందించేందుకు ఈ ప్రాజెక్టును వైఎస్సార్ హయాంలో ప్లాన్ చేశామని చెప్పారు. దిగువన ఉన్న మహారాష్ట్రలో కొంత ప్రాంతం ముంపునకు గురవుతుందని, ఆ ప్రభుత్వంతో చర్చలు జరపాలని భావించామని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారిందని అన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 80 వేల కోట్లకు మాత్రమే కేంద్ర జలవనరుల సంఘం అనుమతి ఇచ్చిందని... దానిని 95 వేల కోట్లుకు గత ప్రభుత్వం తీసుకెళ్లిందని అన్నారు. ప్రస్తుతం రిపేర్లు పూర్తై మనుగడలోకి వచ్చేందుకు 1.50 లక్షల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ వార్షిక వ్యయం 13 వేల కోట్లు ఉండబోతోందని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంపై అనేక అభ్యంతరాలను ఇటు అసెంబ్లీలో, అటు పార్లమెంటులోనూ తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన లేవనెత్తినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
మేడిగడ్డ పిల్లర్లు కుంగినా మాట్లాడలే
ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ జలాశయం పిల్లర్లు ఐదు అడుగుల మేర కుంగిపోయాయని, ఆ నాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఇప్పటి వరకు ఈ అంశంపై నోరు మెదపలేదని చెప్పారు. డిసెంబర్ 7న తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిందని, వెంటనే దీనిని సీరియస్ గా తీసుకున్నామని ఉత్తమ్ చెప్పారు.
జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిలో ప్రకటించారని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో సైట్ మీద ఒక సారి వాస్తవాలు తెలుసుకుందామని మేడిగడ్డ విజిట్ కోసం వచ్చామని తెలిపారు. ఇక్కడి నుంచి కన్నేపల్లి పంప్ హస్, అన్నారం బ్యారేజీలను పరిశీలించి హైదరాబాద్ వెళతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈఎన్సీ ఏమన్నారంటే..
- 2 టీఎంసీల లిఫ్టింగ్ కు ఐదు వేల మెగా వాట్ల కరెంటు
- మూడో టీఎంసీ పనులు చేస్తే 8,450 మెగావాట్ల కరెంటు ఖర్చు
- కాళేశ్వరం ప్రతిపాదిత స్టోరేజీ 141 టీఎంసీలు
- ప్రాజెక్టు కింద సాగైంది.. 98,570 ఎ కరాలు
- నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చిన నీరు స్థిరీకరణకు మాత్రమే
- మూడో టీఎంసీ కోసం 33,400 కోట్లతో ప్రతిపాదన
- ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది 173 టీఎంసీలు
- కాళేశ్వరం మొత్తం ప్రపోజల్ లక్షా 28 వేల కోట్లు
- పాలమూరు ప్రాజెక్టుకు కూడా కాళేశ్వరం పేరుతో అప్పులు
- ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసింది 93,800 కోట్లు
- రెండు టీఎంసీల ప్రాజెక్టు కోసమే రూ. 94 వేల కోట్ల తో ప్రతిపాదన
- ఏడాదిన్నరగా 3 వేల కోట్లకు పైగా కాళేశ్వరం బిల్లులు పెండింగ్