కాళేశ్వరం మొత్తాన్నీ పోలీస్​ క్యాంప్​గా మార్చారు

 కాళేశ్వరం మొత్తాన్నీ పోలీస్​ క్యాంప్​గా మార్చారు
  • దేవాదుల చెక్కుచెదరలే..కాళేశ్వరానికే ఎందుకీ గతి ? 
  • ప్రాజెక్టు మునకపై సుప్రీం కోర్టు
  • జడ్జీతో విచారణ జరిపించాలి
  • బీఎస్పీ స్టేట్​ ప్రెసిడెంట్ డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

హసన్ పర్తి, వెలుగు: సీఎం కేసీఆర్​ఇరిగేషన్​ ఇంజినీర్లను భయపెట్టి చీఫ్​ ఇంజినీర్​గా అవతారమెత్తాడని, సొంత తెలివి చూపించడం వల్లే రూ.1.15 లక్షల కోట్ల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిందని బీఎస్పీ స్టేట్​ ప్రెసిడెంట్ డా.ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ఆరోపించారు. రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రను ఆయన హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం వంగపహాడ్​నుంచి బుధవారం ప్రారంభించారు. సిద్ధాపురం, బైరాన్​పల్లి, అర్వపల్లి, మల్లారెడ్డిపల్లి, ముచ్చర్ల, పెగడపల్లి, సీతంపేట, మునిపల్లి మీదుగా హసన్​పర్తి వరకు ఈ యాత్ర కొనసాగింది. ముచ్చర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టు డిజైన్​ ఎవరు మార్చామన్నారో చెప్పాలన్నారు. 18 ఏండ్ల కిందట కట్టిన దేవాదుల ప్రాజెక్టు చెక్కుచెదరకుండా  ఉండి..మూడేండ్ల కిందటి కన్నెపల్లి పంప్​హౌజ్​ ఎలా మునిగిందని ప్రశ్నించారు. దీనివల్ల దాదాపు రూ.2 వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునకపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నారు. గొప్ప ప్రాజెక్టని చెబుతూ లీడర్లు, మేధావులు, ప్రభుత్వ అధికారులను తీసుకెళ్లి చూపెట్టిన ప్రభుత్వం..ఇప్పుడు అక్కడికి వెళ్తున్న వారిని ఎందుకు అడ్డుకుంటోందో చెప్పాలన్నారు.  కాళేశ్వరం మొత్తాన్నీ పోలీస్​ క్యాంప్​గా మార్చారని  మండిపడ్డారు.

శ్రీలంక దారిలోనే తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిందని, 13 జిల్లాల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయారని ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం శ్రీలంక దారిలోనే పయనిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థికస్థితి పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి పేదలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. యాత్రలో భాగంగా ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ మల్లారెడ్డిపల్లి మహిళలతో కలిసి పొలంలో నాట్లేశారు. సిద్ధాపురంలో గౌడన్నలతో ముచ్చటించారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి, వివిధ పార్టీలకు చెందిన యువకులను కండువా కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. వెంట పార్టీ జిల్లా ఇన్​చార్జ్​  మాదారపు రవికుమార్, జిల్లా అధ్యక్షుడు మంద శ్యామ్ సుందర్, వర్ధన్నపేట ఇన్​చార్జ్​  వేణుగోపాల్, జోనల్ మహిళా కన్వీనర్ కొల్లూరి రజిత, మహిళా జిల్లా కన్వీనర్ అడ్లూరి, పద్మ, మండల కన్వీనర్ ఓంకార్ యాదవ్, గ్రామ కన్వీనర్ మట్టెడ కొర్నేలు పాల్గొన్నారు.