కాళేశ్వరం ముంపు బాధితులకు  భూమికి భూమి ఇయ్యాలె 

కాళేశ్వరం ముంపు బాధితులకు  భూమికి భూమి ఇయ్యాలె 
  • లేదంటే ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చి కొనాలె: వివేక్ వెంకటస్వామి
  • పంటలు మునిగిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇయ్యాలె
  • అప్పుల్లో ఉన్న సింగరేణిని కాకానే కాపాడిండు 
  • ఎమ్మెల్యే సుమన్ రాజీనామా చేస్తేనే చెన్నూర్ అభివృద్ధి అయితదని కామెంట్ 

మంచిర్యాల, వెలుగు: కమీషన్ల కోసం సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. చెన్నూర్ నియోజకవర్గ రైతుల పాలిట శాపంగా మారిందని బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో మూడేండ్లుగా పంటలు మునిగి రైతులు నష్టపోతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పంటలు మునిగిన రైతులను ఆదుకోవాలని పార్టీ జిల్లా​జనరల్ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్ చేపట్టిన మహా పాదయాత్ర బుధవారం రెండో రోజు కోటపల్లి మండలం బోరంపల్లి నుంచి చెన్నూర్ మీదుగా భీమారం వరకు సాగింది. దీనికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై చెన్నూర్ అంబేద్కర్ చౌక్, భీమారం మండల కేంద్రంలో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం బ్యాక్ వాటర్ కింద పంటలు మునిగిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. ముంపు భూములను ప్రభుత్వమే తీసుకొని.. రైతులకు భూమికి బదులు భూమి ఇయ్యాలి. లేకుంటే ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించి సర్కారే సేకరించాలి” అని వివేక్ డిమాండ్ చేశారు. ‘‘కాకా వెంకటస్వామి ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టును తెస్తే.. సీఎం కేసీఆర్ దాన్ని కమీషన్ల కోసం రీడిజైన్ చేశాడు. రాత్రికి రాత్రి వచ్చిన ఆలోచనతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.36 వేల కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు పెంచాడు. ఈ ప్రాజెక్టులో రూ.55 వేల కోట్ల అవినీతి జరిగింది. గత మూడేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లు ఇయ్యకున్నా, ఎత్తిపోతలకు రూ.వెయ్యి కోట్లు దుబారా అయ్యాయి” అని అన్నారు. 
కేసీఆర్.. ఎలక్షన్ సీఎం 
కేసీఆర్ ఎలక్షన్ సీఎం అని, ఎలక్షన్లు ఉంటే తప్ప ఫాంహౌస్​నుంచి బయటకు రాడని వివేక్ విమర్శించారు. హుజూరాబాద్​లో గెలిచేందుకే దళిత బంధు తీసుకొచ్చాడని, దళితులపై చిత్తశుద్ధి ఉంటే అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ స్కీం అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘అధికారం కోసం పార్టీలు మారింది కేసీఆరే. ఎన్టీఆర్​కు ద్రోహం చేసి, చంద్రబాబు దగ్గర చేరాడు. కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకున్నాడు” అని విమర్శించారు. తాను ఏం చేసినా తెలంగాణ కోసమే చేశానని చెప్పారు. 
పార్కుల కోసం దళితుల భూములు గుంజుకుంటరా? 
భీమారం మండల కేంద్రంలో మెగా పార్కు కోసం దళితుల భూములు గుంజుకోవడంపై వివేక్ మండిపడ్డారు. భూములు కోల్పోయిన బాధితులు భీమారంలో వివేక్​ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ భూములు గుంజుకున్నారని, ఇండ్లను కూల్చేస్తామంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లమ్మ అనే మహిళ తనకు ముగ్గురు కూతుళ్లు కాగా, దివ్యాంగురాలైన బిడ్డను తీసుకొని వచ్చి వివేక్​ను కలిశారు. ఉన్న భూమి గుంజుకుంటే తాము ఎట్ల బతకాలని కంటతడి పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన వివేక్.. ఫోన్​లో తహసీల్దార్​తో మాట్లాడారు. పేద దళితుల భూములు లాక్కొని, వాళ్లను రోడ్డుపాలు చేయొద్దన్నారు. పట్టాలు ఉన్నా కూడా భూములు గుంజుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మానవత్వంతో ఆలోచించి ఎవరి భూములు వాళ్లకు అప్పగించాలని కోరారు.  
పాదయాత్రకు ఫుల్ రెస్పాన్స్.. 
పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. చెన్నూర్ అంబేద్కర్ చౌక్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివేక్ పూలమాల వేసి నివాళులర్పించారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీజేపీ లీడర్లు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్​, మునిమంద రమేశ్, మద్ది శంకర్, బొమ్మెన హరీశ్​గౌడ్, సుశీల్​కుమార్, చింతల శ్రీనివాస్, ఆకుల అశోకవర్ధన్, కోడి రమేశ్, మంథని నియోజకవర్గ ఇన్​చార్జి చందుపట్ల సునీల్​రెడ్డి, కౌశిక్ హరి, బషీర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.