- తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ
హైదరాబాద్, వెలుగు: వ్యక్తులు, పార్టీలు మారినా కాళోజీ ఆశించిన తెలంగాణ కల మాత్రం నేటికీ పూర్తిగా సాకారం కాలేదని తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కాళోజీ ఆశయాలు శాశ్వతమని, ప్రస్తుత సమాజానికి ఆయన ఆలోచనలు ఎంతో అవసరమని, ఆ స్ఫూర్తిని నేటి తరానికి చేర్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు అకాడమీ డైరెక్టర్ భట్టు రమేష్ మాట్లాడుతూ.. కాళోజీ కేవలం ఒక వ్యక్తి కాదని, సాహిత్యానికి నిలువెత్తు రూపమని కొనియాడారు. సమాజాన్ని ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యవంతం చేయడంలో కాళోజీ కలం చూపిన బాట అందరికీ ఆదర్శమన్నారు. సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు తూర్పు మల్లారెడ్డి, ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డి కాళోజీతో తమ అనుభవాలను, ఆయన సాహిత్య విశేషాలను పంచుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ తెలంగాణ భాషా దినోత్సవాన్ని విస్తృతంగా నిర్వహించాలని కోరారు.
