నాది ఆస్తి గొడవ కాదు..ఆత్మగౌరవ పోరాటం

నాది ఆస్తి గొడవ కాదు..ఆత్మగౌరవ  పోరాటం
  • స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనయ్‌‌
  • ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటకు పంపారు
  • శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి
  • పార్టీలో ఎన్ని అవమానాలు 
  • ఎదురైనా నవ్వుకుంట పనిచేసిన
  • ఉద్యమంలో పనిచేసినోళ్లను ఆగంజేస్తరనుకోలే
  • బీఆర్ఎస్‌‌కు నైతికత లేదు.. పార్టీకి దూరమవుతున్నందుకు హ్యాపీగా ఉన్న
  • బీఆర్ఎస్​ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల దాకా అన్నింటా అవినీతే!
  • 1.89 లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేవలం ఒక్క కంపెనీకే లక్ష కోట్ల పనులు 
  • తెలంగాణ రాజకీయ అస్తిత్వం కోసం కొత్త పార్టీ పెడుతున్నా
  • తన రాజీనామా ఆమోదించాలని మండలి చైర్మన్‌‌కు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తనది ఆస్తుల కోసం పంచాయితీ కాదని.. ఆత్మగౌరవ పోరాటం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడిన 2014లో మొదటి బతుకమ్మ పండుగ నుంచే తన మీద పార్టీలో ఆంక్షలు మొదలయ్యాయని, కట్టడితో తన భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని ఆవేదన వ్యక్తంచేశారు. 

టీఆర్ఎస్​ను బీఆర్‌‌‌‌ఎస్​గా మారుస్తామంటే తాను ఒప్పుకోలేదని, అందుకే కక్షగట్టి తనను బయటకు పంపించారని చెప్పారు. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైన నవ్వుకుంటూ పనిచేశానని, ఉద్యమంలో పనిచేసినోళ్లను ఆగం చేస్తరని అనుకోలేదన్నారు.

సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన అనంతరం మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి అనుమతితో  కవిత ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కన్నీళ్లను తుడుచుకుంటూ చాలాసేపు తన ఆవేదనను వెలిబుచ్చారు. ‘‘నా వద్దకు ఎప్పుడు కూడా పెద్దవాళ్లు, కాంట్రాక్టర్లు పనుల కోసం రాలేదు. అంగన్‌‌వాడీలు, ఆశా వర్కర్లు, సింగరేణి కార్మికులు, టీచర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే వారి సమస్యల పరిష్కారం కోసం వచ్చారు..  వారి కోసం నావంతుగా ఎంత వీలైతే అంత  పనిచేశా’’  అని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్​ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల నిర్మాణం దాకా అన్నింటా అవినీతి జరిగిందని అన్నారు. తాను ఓ వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని, భవిష్యత్తులో ఒక శక్తిగా మారి మీ ముందుకు వస్తానని  తెలిపారు. 

అమెరికాలో ఉద్యోగం వదిలేసి..కేసీఆర్, ఫ్రొఫెసర్ జయశంకర్​సార్​ స్ఫూర్తితో తాను ఉద్యమంలోకి వచ్చానని కవిత చెప్పారు.
‘‘2006లో అమెరికాలో ఉద్యోగానికి రిజైన్​ చేసి పార్టీ కార్యకర్తగా ఉద్యమంలో అడుగుపెట్టా. అప్పటి నుంచి ఇప్పటి వరకు  20 ఏండ్లుగా ప్రజా జీవితంలోనే ఉన్నా.  అప్పటికే బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారు. 

నేను సొంతంగా జాగృతి సంస్థ ద్వారా పోరాటం ప్రారంభించా. మహిళలను, యువతను ఉద్యమంలోకి తీసుకొచ్చే అనేక కార్యక్రమాలు చేపట్టా. మన పండుగల గౌరవం కాపా డాలని బతుకమ్మను గ్రామ గ్రామాన నిర్వహించా.  3 వేల ఏండ్ల తెలంగాణ చరిత్రను సాక్ష్యాధారాలతో పుస్తకాలుగా వెలువరించా. మీడియాలో, సినిమాల్లో తెలంగాణ యాస, భాషకు జరుగుతున్న అవమానంపై పోరాడా. అప్పటి పాఠ్యా పుస్తకాల్లో తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడాన్ని ప్రశ్నించా. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరాలు అందించా. ఆ కమిటీ తన ఫైనల్ రిపోర్ట్‌‌లో మేం చెప్పిన అంశాలు నిజమేనని తేల్చింది. 8 ఏండ్లపాటు బాలికలు, గిరిజన హక్కుల కోసం ఫైట్ చేశా. తెలంగాణలో ఉన్న సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌‌తో అనేక పోరాటాలు చేశా. వీటితోపాటు తెలంగాణ పోరాటంలో నిత్యం పాల్గొన్నా” అని కవిత వివరించారు.

జార్జ్​ ఫెర్నాండెజ్‌‌తో మాట్లాడించిందే నేను.. 

తెలంగాణ ఉద్యమంలో 2013, 2014లో కీలక సంఘటనలు జరిగాయని కవిత తెలిపారు. ‘‘లోకల్​ కాంగ్రెస్​ లీడర్లు తెలంగాణ కోసం మాట్లాడాలని పిలిస్తే కుటుంబ సమేతంగా మేమంతా ఢిల్లీ వెళ్లాం. అక్కడ 2 నెలలు మమ్మల్ని ఏ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పలుకరించలేదు. 2013 ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌లో మనమంతా కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లు భయపడుతూ ఉన్నాం. ఆంధ్రా లాబీ కారణంగా తెలంగాణ ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందోనని భయపడ్డాం. 

దీపం చుట్టూ చేతులు పెట్టి కాపాడుకున్నట్లు తెలంగాణ ఏర్పాటు ఆగిపోకుండా కాపాడుకున్నాం. అప్పుడే నేను కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ లీడర్, సోనియాగాంధీ టీమ్‌‌లో సీనియర్​ అయిన జార్జ్ ఫెర్నాండెజ్‌‌తో మా నాన్న కేసీఆర్‌‌‌‌కు మీటింగ్​ ఏర్పాటు చేయించా. దీంతో ఆ మరుసటి రోజే సోనియా గాంధీ ఒక్కరోజులోనే ఏడెనిమిది సార్లు కేసీఆర్‌‌‌‌తో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాతే పార్లమెంట్‌‌లోని రెండు సభల్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది. 

ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు కూడా తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటన్నది చెబుతున్నా. గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ తెలంగాణ కోసం నేను ఉద్యమం చేశా” అని స్పష్టం చేశారు.  

ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు..

ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగాలతో దేశానికి, తెలంగాణకు నష్టమని కేసీఆర్ తరచూ అనేవారని, కానీ తెలంగాణ వచ్చాక కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయకపోగా పెంచి పోషించారని కవిత తెలిపారు. ‘‘ప్రశ్నించడం నేర్పిన బీఆర్ఎస్ పార్టీ.. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టింది.  కుట్ర చేసి మరీ నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. 

రాష్ట్రస్థాయి నిర్ణయాల్లో ఎప్పుడు కూడా నా పాత్ర లేకుండా చేశారు. ధర్నాచౌక్‌‌ను తీసేయాలని నిర్ణయించినప్పుడు నేను ప్రశ్నించా. తెలంగాణ వచ్చాక ధర్నా చౌక్ ఎందుకు? అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి బేడీలు వేయడం బాధించింది. 10 ఏండ్లలో100 సార్లు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కోసం అడిగా. కానీ నిర్లక్ష్యం చేసి బోధన్ బిడ్డలకు అన్యాయం చేశారు.

 కేసీఆర్ కూతురిగా ఆయనను అడిగే ధైర్యం నాకు ఉంది. ఒకటి, రెండు అడిగినవి చేయకపోయినా ఫర్వాలేదు. కానీ కొంతమంది వరుసగా దురాగతాలకు పాల్పడిన సరే పట్టించుకోలేదు. పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. నిజాన్ని సూటిగా మాట్లాడితే నన్ను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. 

వారికి న్యాయం చేయాలని..అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల చొప్పున ఒక్కొక్కరికి సాయం చేయాలని కోరా. ‘48 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా చెప్పుకుంటాం. కానీ లక్ష మంది ఉద్యమకారులకు పెన్షన్ కూడా ఇవ్వలేమా?’ అని ప్రశ్నించిన. అధికారంలోకి వచ్చినప్పటికీ 1969 ఉద్యమకారులను కూడా గుర్తించలేదు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన జాతీయ స్థాయి నేతలనెవ్వరినీ పిలిచి ఒక శాలువా కూడా కప్పలేదు” అని వ్యాఖ్యానించారు. 

అన్నింటా అవినీతే!

అమరజ్యోతి, సెక్రటేరియెట్‌‌, అంబేద్కర్​ విగ్రహం, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనేది నిజమని కవిత తెలిపారు.‘‘సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి. అవినీతి జరిగిందని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలవా? నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మన ట్యాగ్ లైన్‌‌కు గండికొట్టుకుంటూ పోయాం. కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న అవినీతిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేవు. 

ఇసుక దందాల కారణంగా నేరెళ్లలాంటి దురాగతాలు జరిగాయి. నేరెళ్ల సంఘటనపై అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం లేదు. సాగునీటి ప్రాజెక్టులపై లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి  కొత్తగా14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు.  అదే డబ్బులతో 25 లక్షల మంది పేదలకు ఇండ్లు కట్టివ్వొచ్చు. లక్షా 89 వేల కోట్లల్లో ఒక్క కంపెనీకే లక్ష కోట్లకు పైగా పనులు అప్పగించారు. 1989లో చిన్న కంపెనీ పెట్టుకున్న ఆయన ఫోర్బ్స్​ ధనవంతుల జాబితాలో 45వ స్థానంలో నిలిచారు. తెలంగాణలో అవినీతి లేని పారదర్శక విధానాన్ని మనం చూడాలనుకున్నాం. అది జరగలేదు”అని అన్నారు.   

బీఆర్ఎస్‌‌కు నైతికత లేదు.. 

బీఆర్ఎస్‌‌ పార్టీకి నైతికత లేదని కవిత మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఘోష్ కమిటీ అని వేశారు. కేసీఆర్‌‌‌‌ను విచారణ అంటూ ఎన్నో మాటలు అంటే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలేదు.  అదే కేటీఆర్, హరీశ్‌‌ని అంటే మాత్రం పార్టీ నాయకులు విమర్శలు చేస్తారు.  నేను మాత్రమే జాగృతి ద్వారా ఫైట్ చేశా. నేను హరీశ్‌‌రావు పేరు చెప్పిన రెండు గంటల్లో నన్ను సస్పెండ్ చేశారు. ఉరి తీసేవాళ్లను కూడా చివరి కోరిక ఏమిటని అడిగే గొప్ప దేశం మనది. 

కనీసం నన్ను మాత్రం అన్యాయంగా పార్టీ నుంచి వెళ్లగొట్టారు. బీఆర్ఎస్ పార్టీ కానిస్టిట్యూషన్ కమిటీ 8 పేజీలే ఉంటుంది. అది ఒక పెద్ద జోక్. నన్ను సస్పెండ్ చేసేందుకు రాత్రికి రాత్రే డిసిప్లేనరీ యాక్షన్ కమిటీ పుట్టుకొచ్చింది. నోటీసులు ఇవ్వకుండా, నా వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు. ఒక పార్టీని నడిపే పద్ధతి ఇది కానే కాదు. నా సస్పెండ్‌‌పై లీగల్‌‌గా చాలెంజ్ చేయవచ్చు. కానీ నైతికత లేని బీఆర్ఎస్‌‌పై అలా చేయలేను. ఆ పార్టీకి దూరమవుతున్నందుకు సంతోషంగా ఉన్నా’ అని తెలిపారు. 

బీఆర్ఎస్‌‌కు రాజ్యాంగ స్ఫూర్తిలేదు..

టీఆర్ఎస్‌‌ను బీఆర్ఎస్‌‌గా మార్చాలన్న నిర్ణయాన్ని తాను ఒప్పుకోలేదని కవిత తెలిపారు. ‘‘తెలంగాణలో ఏమీ పీకి కట్టామని జాతీయస్థాయికి పోవాలి?” అని ప్రశ్నించానన్నారు. ‘‘బీఆర్ఎస్‌‌లో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. పార్టీలు కూడా రాజ్యాంగాన్ని మార్చుకొని మహిళలను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నా దారి వేరైనా సరే నా లక్ష్యం మాత్రం ఒక్కటే. తెలంగాణ ప్రజలు బాగుండాలి. వారి కోసం నేను పనిచేస్తూనే ఉంటా. నేను నిజం, నైతికత వైపు నిలబడి ఉన్నా. 

పార్టీలో కొంతమంది సామాన్యులు, ఉద్యమకారుల సమస్యలు కేసీఆర్‌‌‌‌కు  చేరకుండా అడ్డుగోడ కట్టారు. ఇవ్వాళ సభలో ప్రతిపక్షం లేనే లేదు. భవిష్యత్తులో మేం ప్రజల ఆకాంక్షలను ఫుల్‌‌ఫిల్‌‌ చేస్తం. ఈ సభ నుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా..భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా.. జై తెలంగాణ..’’ అంటూ కవిత తన ప్రసంగాన్ని ముగించారు.

నా పోరాటం.. తెగువ చూసి ఎంపీ టికెట్ ఇచ్చారు..

తెలంగాణలో తాను ఓ ఇంటర్నేషనల్​ ఎన్జీవో నడపాలని అనుకున్నానే తప్ప రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని కవిత తెలిపారు. ‘‘ఏ మహిళ అయినా సరే పిల్లలను వదిలి రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచిస్తుంది. 4 నెలలపాటు నా జీవిత భాగస్వామితో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నా. ఏ రోజు కూడా నేను పదవులు, రాజకీయం కోసం వెళ్లలేదు. నాకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో నా శక్తికి మించి పనిచేసేందుకు కృషి చేశా. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌‌లో బీఆర్ఎస్ విలీనంపై చర్చ జరిగినప్పటికీ అది జరగలేదు. బీఆర్‌‌‌‌ఎస్​ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలని భావించింది. ఆ సమయంలో నిజామాబాద్​ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ సంఖ్యలో గెలవడానికి నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానమే నన్ను పిలిచి టికెట్​ ఇచ్చింది. నేను ఎప్పుడు కూడా టికెట్ అడుక్కొని గెలవలేదు. నా పోరాటం, తెగువ చూసి పార్టీ ఎంపీ టికెట్​ ఇచ్చారు.  దీనివల్ల 2014లో నిజామాబాద్ లో మొత్తం 9 ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది” అని తెలిపారు. 

2014 నుంచే నాపై ఆంక్షలు 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉంటుందని సంతోషపడ్డానని కవిత తెలిపారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విభజన అంశాలపై, హైకోర్టు సాధించుకోవడానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల కోసం పోరాటం చేశాం. పెద్దపల్లి–- నిజామాబాద్ రైల్వే లైన్ 30 ఏండ్లు పెండింగ్‌‌లో ఉంటే ఎంపీ అయ్యాక ఆ రైల్వే లైన్  పూర్తి చేయించా. 

జాగృతి పేరుతో 2006 నుంచి 8 ఏండ్ల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాం. కానీ తెలంగాణ ఏర్పడిన మొదటి బతుకమ్మ (2014) నుంచే నా మీద ఆంక్షలు మొదలయ్యాయి. మొదటిరోజు నుంచే నన్ను కట్టిడి చేస్తూ నా భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు’’ అంటూ కవిత కన్నీళ్లుపెట్టుకున్నారు.   

కేసీఆర్‌‌‌‌పై కక్షతో నన్ను జైల్లో పెట్టారు 

తెలంగాణను కేంద్రంలోని బీజేపీ సర్కారు పదే పదే మోసం చేస్తున్నదని కవిత మండిపడ్డారు. ‘‘తెలంగా ణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. విభజన హామీలు అమలు చేయలేదు. ఐటీఐఆర్ రాకుండా చేసి ఇక్కడి యువతకు అన్యాయం చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారిని ఇతర రాష్ట్రాల్లో ఇన్వెస్ట్‌‌ చేయాలని కోరింది. అలాం టి బీజేపీపై నేను ఎడతెగని పోరాటం చేశా. కేసీ ఆర్‌‌‌‌పై కక్షతో నన్ను జైల్లో పెట్టారు. ఆ సమయంలో నాకు బీఆర్ఎస్‌‌ అండగా నిల్చోలే. ఈడీ, సీబీఐతో మూడేండ్లు నేను ఒక్క దాన్నే ఫైట్ చేశా. ఏదైనా పోరాటంలో సహచరులు గాయపడితే భుజాన ఎత్తుకొని వెళ్తారు. కానీ నన్ను ఒంటరిగా వదిలేశా రు. పార్టీ చానెల్‌‌, పార్టీ పేపర్‌‌‌‌ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లా. ఇది ఏమాత్రం రాజ్యాంగ స్ఫూర్తి ఉన్న పార్టీ వ్యవహరించే తీరు కాదు’’ అని కవిత పేర్కొన్నారు.

ఇక నేను పోతే మండలిలో ఇద్దరే మహిళలు

నాది నిజంగా ఆత్మగౌరవ పోరాటమేనని కవిత స్పష్టం చేశారు. ‘‘నా సస్పెన్షన్‌‌ను వాడుకునేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇది ఆస్తుల పంచాయితీ అంటున్నారు. నాకు దైవ భక్తి ఎక్కువ. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ దేవుడి మీద, నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా. నాది ఆత్మగౌరవ పోరాటమే’’ అని కన్నీటి పర్యంతం అయ్యారు. 

 ‘‘మన రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 17 ఎంపీలకు ఒకరు, 119 మంది ఎమ్మెల్యేలకు 8 మంది, ఇక మండలిలో 40 మందికి ముగ్గురు మాత్రమే మహిళా సభ్యులు. నేను వెళ్లిపోతే ఇద్దరే ఉంటారు. ఈ రాష్ట్రంలో మహిళల ప్రాతినిధ్యం 0.0003 శాతం మాత్రమే ఉంది. మరి ఆడవాళ్లకు కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి. గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి. మహిళలకు సమాన హక్కులు రావాలని అన్నారు” అని కవిత గుర్తు చేశారు. 

రాజీనామాపై పునరాలోచించండి: మండలి చైర్మన్‌‌ గుత్తా

భావోద్వేగంతో కూడిన రాజీనామా సరైంది కాదని,  పునరాలోచించుకోవాలని కవితకు మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ కవిత ప్రసంగం ముగిసిన తర్వాత  సుఖేందర్‌‌‌‌రెడ్డి మాట్లాడారు.   దీనిపై కవిత స్పందిస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత లేని బీఆర్ఎస్ పార్టీలో తాను ఉండలేనని, ఆ పార్టీ తరఫున వచ్చిన ఎమ్మెల్సీ పదవి తనకు అక్కర్లేదని సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 3 న తన రాజీనామా పత్రం అందించానని, ఇప్పటికే 4  నెలలు గడిచినందున తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. 

నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా..

నాది ఆస్తుల పంచాయితీ కాదు.. ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయితీనే. మా ఇంటి దేవుడైన లక్ష్మీనరసింహస్వామి మీద, నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా..

ఇక్కడేం పీకినమని జాతీయస్థాయికి పోవాలి

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్​గా మార్చొద్దని నేను చెప్పినా వినలేదు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టినమని జాతీయస్థాయికి పోవాలె? అని ప్రశ్నించిన. నా మాట వినకుండా బీఆర్ఎస్‌‌గా మార్చారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలో అన్నింటా అవినీతే!

బీఆర్ఎస్‌‌ హయాంలో అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగింది. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయినయ్‌‌. అవినీతి జరిగిందని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలవా? నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మన ట్యాగ్ లైన్‌‌కు గండికొట్టుకుంటూ పోయాం.  

ఒక్క కంపెనీకే లక్ష కోట్లకుపైగా పనులు

సాగునీటి ప్రాజెక్టులపై లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి  కొత్తగా14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు.  లక్షా 89 వేల కోట్లల్లో ఒక్క కంపెనీకే లక్ష కోట్లకు పైగా పనులు అప్పగించారు. 1989లో చిన్న కంపెనీ పెట్టుకున్న ఆయన ఫోర్బ్స్​ జాబితాలో 45వ స్థానంలో నిలిచారు.

వ్యక్తిగా వెళ్తున్నా.. శక్తిగా తిరిగొస్త..

బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ నన్ను సస్పెండ్​ చేసినందునే..ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా. ఈ సభనుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా.. భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా. నేను నిజం, నైతికత వైపు నిలబడి ఉన్నా.  తెలంగాణ అభివృద్ధికి కమిటెడ్‌‌గా పనిచేయాలని ఉన్నది.