ఇయ్యాల సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్

ఇయ్యాల సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్
  • దర్యాప్తు సంస్థలు తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరుతూ నిరుడు రిట్​ పిటిషన్​ దాఖలు
  • ఏడాదినుంచి వాయిదాపడుతూ నేడు విచారణకు
  • ఈడీ అక్రమ అరెస్ట్​ అంశాన్ని లేవనెత్తనున్న కవిత లాయర్లు

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తర్వాత తొలిసారి సుప్రీంకోర్టు ముందుకు గతంలో ఆమె దాఖలు చేసిన 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ (క్రిమినల్) విచారణకు రానున్నది. దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు (అరెస్ట్)​ తీసుకోకుండా చూడాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈడీ ఆఫీసుకు మహిళలను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై నిరుడు మార్చిలో కవిత తరపు అడ్వొకేట్​ వందన సెహఘల్ మొత్తం 105 పేజీల పిటిషన్ వేశారు. దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తున్నది.

తాజాగా ఈ నెల 15న పిటిషన్ జస్టిస్‌‌‌‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌‌‌‌ పంకజ్‌‌‌‌ మిత్తల్‌‌‌‌తో కూడిన బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా కవిత తరఫు సీనియర్ అడ్వొకేట్​ విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. గత ఆదేశాల ప్రకారం ఈనెల 13 నాన్ మిస్ లీనియస్ రోజు రావాల్సిన ఈ పిటిషన్, మిస్ లీనియస్ రోజైన 15వ తేదీన బెంచ్ ముందుకు వచ్చిందన్నారు. వచ్చేవారంలో నాన్ మిస్​లీనియస్​ రోజు ఈ పిటిషన్ విచారించాలన్న విక్రమ్ చౌదరి విజ్ఞప్తితో ధర్మాసనం మార్చి 19 కి వాయిదా వేసింది. కాగా, అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలపేరిట ప్రవేశించిన ఈడీ అధికారులు.. సాయంత్రానికి ఆమెను అరెస్ట్ చేసి, అదే రోజు ఢిల్లీకి తరలించారు. 

కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు 

తన అరెస్ట్ ను నిరసిస్తూ కవిత న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఒకవైపు సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉండటం, మూడు రోజుల్లో పిటిషన్ మరోసారి బెంచ్ ముందుకు రానున్న టైంలో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని సోమవారం ఉదయం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ మేరకు ఆమె తరపు న్యాయవాదులు కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు.

అయితే, ఈ పిటిషన్ కు డైరీ నెంబర్ వచ్చినా.. సోమవారం లిస్ట్ కాలేదు. అయినప్పటికీ ఈ అంశాన్ని సోమవారం కవిత తరపు న్యాయవాదులు కోర్టు ముందు మెన్షన్ చేయలేదు. ఎలాగూ మంగళవారం (నేడు) రెగ్యులర్ బెంచ్ ముందుకు కవిత పిటిషన్ రానున్న నేపథ్యంలో అదే టైంలో అక్రమ అరెస్ట్   అంశాన్ని లేవనెత్తాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే, ఎందుకు మూడు రోజుల  ముందు అత్యవసరంగా ఆమెను అరెస్ట్ చేశారని వాదించనున్నారు. ఆమె దేశం విడిచి పారిపోవడం లేదని, రాజకీయ నాయకురాలు అయిన తాను.. తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి దూరం అయ్యే ఆస్కారం ఉందని బెంచ్ కు వివరించనున్నట్టు తెలిసింది.