
కోల్‌కతా: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకే ధన్‌ఖడ్ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనను ఎన్నిసార్లయినా అనుకరిస్తానని స్పష్టం చేశారు. ఆదివారం బెంగాల్‌లోని తన సొంత నియోజకవర్గం సెరాంపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కళ్యాణ్ బెనర్జీ పాల్గొని, మాట్లాడారు. ‘మిమిక్రీ అనేది ఒక కళ. నేను మిమిక్రీ చేస్తూనే ఉంటాను. మిమిక్రీతో భావాలను వ్యక్తపరచే ప్రాథమిక హక్కు నాకు ఉంది. దాన్ని ఎవరూ నాశనం చేయలేరు. అవసరమైతే.. నేను ఇంకా వేయి సార్లు చేయగలను. మీరు నన్ను జైలులో పెట్టినా సరే వెనుకడుగు వేయను’ అని కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.