చెన్నై: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు ఇండియాకు నెల రోజులు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించడంపై రాజ్యసభ ఎంపీ, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ కొనుగోలు విషయంలో ఇండియాకు ఏ దేశ అనుమతులు అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. మీ పని మీరు చూసుకుంటే మంచిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చురకలటించారు.
భారత ప్రజలు స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమ దేశానికి చెందినవాళ్లని.. మాకు ఇతరుల పర్మిషన్లు అక్కర్లేదని హితవు పలికారు. దయచేసి మీ శక్తి సామర్థ్యాల ఉపయోగించి మీ పని మీరు చూస్కోండని ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం ప్రపంచ శాంతికి ఏకైక పునాది అని పేర్కొన్నారు. అమెరికా దేశ ప్రజల శాంతి, శ్రేయస్సును కోరుకుంటున్నామన్నారు.
మాకు ఎవరి అనుమతి అక్కర్లే: భారత్
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును ఉటంకిస్తూ క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు ఇండియాకు ఎవరి అనుమతి అక్కర్లేదని భారత్ కౌంటర్ ఇచ్చింది. రష్యన్ చమురు కొనుగోలు చేయడానికి భారత్ ఎప్పుడూ ఇతర దేశాల అనుమతులపై ఆధారపడలేదని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2026లో కూడా భారతదేశం ఇప్పటికీ రష్యన్ చమురును దిగుమతి చేసుకుంటోందని చెప్పింది. రష్యా ఇప్పటికీ భారతదేశానికి అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు అని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యన్ ఆయిల్‌పై యూఎస్, ఈయూ ఆంక్షలు ఉన్నప్పటికీ భారతదేశం రష్యన్ చమురును కొనుగోలు చేస్తూనే ఉందని వివరణ ఇచ్చింది.
అసలు విషయం ఏంటంటే..?
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఎవరూ ముడి చమురు కొనుగోలు చేయొద్దని ప్రపంచదేశాలను అమెరికా ఆదేశించింది. ఈ క్రమంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలపై వాణిజ్య సుంకాలు విధించింది. ఈ సాకుతో ఇండియాపై అమెరికా 25 టారిఫ్స్ విధించింది. దీంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును ఇండియా తగ్గించి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా కొంటోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంన్నందుకు ఇండియాపై వేసిన సుంకాన్ని కూడా అమెరికా రద్దు చేసింది.
ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం గల్ఫ్ దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి, రవాణాపై గణనీయంగా పడింది. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో పలు దేశాలకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే రష్యా నుంచి ముడిచమురు కొనేందుకు ఇండియాకు నెల రోజులు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిపై ఇండియా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఆయిల్ కొనుగోలు విషయంలో మాకు ఎవరి అనుమతి అవసరం లేదని అమెరికాకు కౌంటర్ ఇచ్చింది.
