మున్సిపల్​ స్థలాలు ఖతం చేస్తున్రు !

మున్సిపల్​ స్థలాలు ఖతం చేస్తున్రు !
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓపెన్​ ప్లాట్ల కబ్జా 
  • డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేస్తున్న అక్రమార్కులు
  • తెలియక నష్టపోతున్న కొనుగోలుదారులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్​ఓపెన్ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. స్థలాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుండడం, దీన్ని అదునుగా తీసుకుంటున్న కొందరు వ్యక్తులు వాటిని కబ్జా చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌ వస్తే కొనుగోలు చేసిన వ్యక్తులు నష్టపోతున్నారు. 

 
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి టౌన్ పలు జిల్లాలకు జంక్షన్‌‌‌‌‌‌‌‌గా ఉండడం.. నేషనల్ హైవేతో పాటు రాజధానికి సమీపంలో ఉండడంతో ఇక్కడ ఇండ్ల స్థలాలకు డిమాండ్ పెరింది. టౌన్‌‌‌‌‌‌‌‌లో గజం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రేటు పలుకుతోంది. దీంతో కొందరు వ్యక్తులు మున్సిపల్ ఓపెన్ స్థలాలకు ఎసరు పెడుతున్నారు. లే అవుట్ చేసేటప్పుడు స్థానిక అవసరాల కోసం కొంత స్థలాన్ని ఓపెన్ ప్లేస్‌‌‌‌‌‌‌‌గా వదులుతారు. మార్కెట్, గవర్నమెంట్ స్కూల్, పార్కు, ప్లే గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ వంటి వాటి కోసం వాటిని ఉపయోగించాలి. కామారెడ్డిలో ఇప్పటికే గత మున్సిపల్​పాలకవర్గాలు ఓపెన్ స్థలాలను ప్రార్థన మందిరాల నిర్మాణం, కుల సంఘాల బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ వంటి వాటి కోసం కేటాయించాయి. ఇదంతా అనధికారికంగా జరిగింది. ప్రస్తుతం 60 వరకు ఓపెన్ స్థలాలు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది.  

స్థలాలపై కన్నేసి..

టౌన్‌‌‌‌‌‌‌‌లోని ఓపెన్ స్థలాలకు రక్షణ చర్యలు లేకపోవడం, కొన్ని ఎక్కడ ఉన్నాయో కూడా ఆఫీసర్లకు తెలియకపోవడంతో వాటిపై కొందరు వ్యక్తులు కన్నేశారు. వీటికి డాక్యుమెంట్లు, లింక్​డాక్యుమెంట్లు సృష్టిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కూడా అవుతుండడంతో కొనుగోలుదారులు కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా కొంటున్నారు. తీరా కొన్నాక బయట పడితే నిర్మాణాలు ఆపేస్తున్నారు. ఈ వ్యవహారాల వెనుక కొందరు లీడర్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల బయట పడిన ఘటనలు

ఆశోక్​నగర్​ కాలనీలో  కొందరు వ్యక్తులు స్థలాన్ని అమ్మగా ఓ వ్యక్తి కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. స్లాబ్​లెవల్ వరకు వచ్చింది. స్థానికులు కొందరు ఆ స్థలం మున్సిపల్​ఓపెన్‌‌‌‌‌‌‌‌ స్థలంగా గుర్తించి ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిర్మాణ పనులు ఆగలేదు. మరో సారి స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆఫీసర్లు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను కూల్చి వేయించారు. గంజు రాంమందిర్​ఏరియాలో ఓపెన్ స్థలంలో ఇద్దరు వ్యక్తులు బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. సంబంధిత వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దేవునిపల్లి పరిధిలో ఓ రోడ్డుకు అనుకుని ఉన్న ఓ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ స్థలంలో కూడా నిర్మాణం జరుగుతోంది.

రక్షణ లేక..

టౌన్‌‌‌‌‌‌‌‌తో పాటు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లోనూ ఓపెన్ స్థలాలు ఉన్నాయి. వీటికి రక్షించడం పై ఆఫీసర్లు శ్రద్ధ చూపడం లేదు. విలీన గ్రామాల్లో  ఓపెన్ స్థలాలకు సంబంధించిన రికార్డులు పంచాయతీలుగా ఉన్నప్పుడు మాయమయ్యాయి.  టౌన్‌‌‌‌‌‌‌‌లో మిగిలి ఉన్న 60 స్థలాలకు రక్షణ కోసం కాంపౌండ్ వాల్స్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కొంత కాలం కింద నిర్ణయించారు. సగం స్థలాలకు  కంపౌండ్ వాల్స్, ఫెన్సింగ్ వర్క్స్​చేశారు. మిగతా వాటిని వదిలేశారు. కొన్ని చోట్ల పట్టణ ప్రగతి కింద మినీ పార్కులు ఏర్పాటు చేశారు.  ఓపెన్ స్థలాలపై  ఇటీవల బీజేపీ, టీఆర్ఎస్ లీడర్ల మధ్య  ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. రాజకీయంగా కూడా దూమారం రేగింది.  ఓపెన్​ స్థలాలను కాపాడేందుకు ఉన్నతాధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. 

ఆక్రమణలు జరగకుండా చూస్తాం

మున్సిపాలిటీ పరిధిలోని ఓపెన్​స్థలాల్లో అక్రమణలు జరగకుండా తగిన చర్యలు చేపడుతాం. చాలా చోట్ల పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. కంపౌడ్ వాల్స్ కూడా కట్టడం జరిగింది.  
- దేవేందర్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్​కమిషనర్, కామారెడ్డి