మునిగిన హంపి మండపాలు... నీటిలో కనబడకుండా పోయిన బ్రిడ్జ్

మునిగిన హంపి మండపాలు... నీటిలో కనబడకుండా పోయిన బ్రిడ్జ్

తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో తుంగభద్ర నది ప్రవహించే పరివాహక ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఇందులో ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ది గాంచిన హంపిలోని పలు స్మారకాలు నీటిలో మునిగిపోయాయి. ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయల సమాధి, బళ్లారి, కొప్పళ జిల్లాల వారధిగా ఉన్న కంప్లి వంతెన పూర్తిగా మునిగి పోవడంతో రెండు జిల్లాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. జలాశయానికి ఉన్న 33 క్రస్ట్‌గేట్లలో 28 గేట్లను 4 అడుగుల మేర, మిగిలిన ఐదు క్రస్ట్‌గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

 ఈ పరిస్థితుల్లో రెండు లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలే పరిస్థితి రావచ్చని అధికారులు చెప్తున్నారు. కంప్లి నదిలో వరద ఉధృతి పెరగడంతో నది ఒడ్డున ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే ప్రాంతంలోని వెంకటరమణ దేవాలయం, గంగమ్మ గట్టు చుట్టూ భారీగా నీరు చేరింది. చారిత్రాత్మక కుమారాం కోట ద్వారం జలమయమైంది. హంపి పురంధరదాసు మండపం, కర్మమండపం, విజయనగర కాలం నాటి కాలినడక వంతెన, చక్రతీర్థం, రామాలక్ష్మణ దేవాలయం, పాలుమండపం, స్నానఘట్టాలు వంటివన్నీ కూడా నీట మునిగి... చెరువులను తలపిస్తు్న్నాయి.