మన ఆలోచనలకు కంచెలు?! ఈ పుస్తకాన్నిచదవడం మొదలు పెడితే వదలరు

మన ఆలోచనలకు కంచెలు?! ఈ పుస్తకాన్నిచదవడం మొదలు పెడితే వదలరు

సమాజంలో నిత్యం చోటు చేసుకునే సంఘటనలు, ఆందోళన కలిగించే సామాజిక పరిణామాలు, విద్వేషపూరిత రాజకీయాలను వాటివల్ల ప్రభావితమవుతున్న అంశాలను ఎంతో చాకచక్యంతో విమర్శనాత్మకంగా ఈ 'దేహాలపై కంచెలు' అనే పుస్తకంలో రాయడం జరిగింది. వాస్తవిక సంఘటనలు, తరతరాలుగా మన ఆలోచనలను నియంత్రిస్తున్న వాటికి సాహిత్యాన్ని జతకడుతూ ప్రతిభావంతంగా రాయడంలో రచయిత్రి ప్రయోగం బాగుంది. ఇది అనువాద రచనే అయినా.. ఈ పుస్తకాన్ని చదవడం మొదలుపెడితే ఆసాంతం చదివేస్తాం.

ఉక్కిరి బిక్కిరి అవుతుందనే భావన మనలో కలిగినప్పుడు, తిరిగి ఊపిరి నిలుపుకునే ప్రయత్నం చేస్తాం. అదే పరిస్థితి బంధంలో, ఉన్న గ్రామంలో ఉంటే, అక్కడినుంచి వెళ్లిపోవాలని, విముక్తి కావాలని కోరుకుంటాం. అలాంటిది నువ్వు అనుసరిస్తున్న మతమో, సంస్కృతో నీ స్వేచ్చను హరిస్తే, మళ్లీ తప్పించుకునే ప్రయత్నమే చేస్తాం. మరి అదే నువ్వున్న దేశం నీకు.. ‘నాదనే అనుభూతి ఇవ్వకపోతే’ అనే మీమాంసతో.. అందులోని సమస్యలను స్పృశిస్తూ, నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను. అందువల్లే ఇలా రాస్తున్నాను. ఊపిరి ఆడటానికే రాస్తానంటోంది రచయిత్రి. 

ఆదర్శాలన్నీ దోపిడీకి గురవుతున్నప్పుడు, అల్లరిమూకలు హింసను ఆస్వాదిస్తుంటే, నేరగాళ్లకు రాజకీయ నాయకులు రక్షణ కల్పిస్తుంటే ఏమవుతుంది. నిరాశ నిస్పృహలే ఆవరిస్తాయి. మనం ఉంటున్న ఈనాటి పరిస్థితులను వర్ణించేందుకు నేను మాటలు, వాక్యాలు వెతుక్కుంటున్నాను. మన దేహాలకు, ఆలోచనలకు కంచెలు వేయబడ్డాయని తనకు కలిగిన నిరాశభావనను ఈ వ్యాసాల రూపంలో విశదీకరించారు. ఈ స్థితిని వర్ణించేందుకు నాకస్సలు ఊపిరి ఆడలేదు. ఈ స్థితిని చిత్రించడానికి, చూపడానికి నాకు ముళ్ళ కంపపై దేహమున్న చిత్రమే సరైనదిగా తోస్తుందంటారు. 

మరో వ్యాసంలో నియంతృత్వం మాటలను నియంత్రిస్తుంది. ఇందులో మొదటగా బలయ్యేది పదాలే.. శరీరాలను చిత్రవధ చేసినట్లు పదాలను చిత్రవధ చేస్తారు. ‘ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే ముందు ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైందని మాట్లాడతారు’. పదాలతో, మాటలతో విద్వేషరూపంలో విషం చిమ్ముతుంటారు. వాస్తవానికి పదాలకు పరిధి లేదు. కాగితాల్లో చూసేవే పదాలు కాదు. మనం చూసే కొద్దీ అవి మనకు చేరువవుతాయి. మనతో సంభాషిస్తాయి. వస్తువులకు రూపాన్ని, కదలికలనిస్తాయి. పేరులేనివారికి పేర్లనిస్తాయి. దారితప్పిన అడవులను కథలుగా మార్చి, కదిలిస్తాయి. మౌనానికి, మాటకి మధ్య వారధిగా నిలుస్తాయి. జీవితానికి, ప్రపంచానికి ఇవి ఎంతో కీలకం. అటువంటి పదాలు, భాష అమాయకమైనవి కావు. అవి సామాజిక సంబంధాలకు ఉత్పత్తులు. ఉపయోగించే తీరును బట్టి వ్యక్తమవుతుంటాయి. మొత్తంగా ఈ పుస్తకం, మన దేశచరిత్రలో చీకటిగా మిగిలిన క్షణాలను, నియంత్రణల మధ్య జీవితం ఎలా నలిగిపోతోందో వివరిస్తోంది.
- పి. రాజ్యలక్ష్మి