
నందిగామ: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద పోలీసు అధికారులు తనిఖీలు చేసి సుమారు 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గంజాయిని విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో.. కంచికచర్ల పోలీసులు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాల్లో AP 31 AH 6485 అనే నెంబర్ గల కారులో 200 కేజీల గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. తనిఖీలు చేస్తుండగా కారు నుండి దిగి పరారీకి యత్నించిన కారులోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు సిరిపురం వెంకటేష్, రమావత్ విజయ్ లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులతో సహా కారును కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.